భారతదేశ ఎన్నికల 24వ ప్రధాన కమిషనర్‌గా (సీఈసీ) శ్రీ సుశీల్ చంద్ర బాధ్యతలు స్వీకరించారు. సుశీల్ చంద్రకు ముందు సీఈసీగా కొనసాగిన శ్రీ సునీల్ అరోరా ఈ నెల 12వ తేదీన తన పదవీకాలాన్ని ముగించారు.
2019 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి సుశీల్ చంద్ర ఎన్నికల సంఘానికి సేవలు అందిస్తున్నారు. జమ్ముకశ్మీర్ యూటీకి సంబంధించిన డీలిమిటేషన్ కమిషన్‌లోనూ 2020 ఫిబ్రవరి 18 నుంచి సభ్యుడిగా ఉన్నారు. 39 ఏళ్ల పాటు ఆదాయపన్ను విభాగంలో విశేష సేవలు అందించారు. 2016 నవంబర్ 1 నుంచి 2019 ఫిబ్రవరి 14 వరకు సీబీడీటీ ఛైర్మన్‌గానూ పని చేశారు.
శాసనసభ ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకోవడంలో సీబీడీటీ ఛైర్మన్‌గా సుశీల్ చంద్ర చురుగ్గా వ్యవహరించారు. ఆయన పర్యవేక్షణ కారణంగా, ఇటీవలి ఎన్నికల సమయాల్లో నగదు, మద్యం, ఉచిత బహుమతులు, మాదకద్రవ్యాలను భారీగా పట్టుకున్నారు. ప్రలోభ రహిత ఎన్నికల భావనను ఆయన గట్టిగా నమ్మారు. ప్రస్తుత, భవిష్యత్ ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణలో ఇది ముఖ్యాంశంగా మారింది. ప్రత్యేక వ్యయ పరిశీలకుల నియామకం ద్వారా సమగ్ర పర్యవేక్షణ, ఎన్నికల వ్యయ పరిశీలన కోసం ఎన్నో సంస్థలు పాల్గొనేలా చేయడం, ఎన్నికల పరిశీలకులు, ఇతర ఏజెన్సీల ద్వారా తరచూ సమీక్షలు జపరడం వంటివి ఎన్నికల సమర్థ నిర్వహణలో సునీల్ చంద్ర ప్రవేశపెట్టిన కొన్ని అంశాలు. ఫారం-26 వంటి మార్పులు కూడా ఆయన సేవలను ప్రతిబింబిస్తాయి. ఎన్నికల అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్ల పరిశీలనకు ఆయన ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. అభ్యర్థులు తమ అఫిడవిట్లలో వెల్లడించని ఆస్తులు, అప్పుల పూర్తి వివరాలను పంచుకునేందుకు ఒకే తరహా విధానాన్ని 2018లో ప్రవేశపెట్టడంలో సీబీడీటీ ఛైర్మన్‌గా శ్రీ చంద్ర కీలక పాత్ర పోషించారు. 2019లో జరిగిన 17వ లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్, దిల్లీ శాసనసభ ఎన్నికల నుంచి ఎన్నికల ప్రక్రియల్లో తీసుకొచ్చిన ఆధునిక సాంకేతిక పద్ధతులు శ్రీ సుశీల్ చంద్ర కృషికి నిదర్శనం.