HCU Lands Case : స్మితా సబర్వాల్ కు పోలీసుల నోటీసులు!


ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేసిన ఘటన ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పరిసరాల్లో ఉన్న కంచె రాక్ వద్ద బుల్డోజర్లు, జింకలు, నెమళ్లను గిబ్లీ శైలిలో చూపించే ఒక ఏఐ చిత్రం మార్చి 31న “హాయ్ హైదరాబాద్” అనే X (ట్విట్టర్) ఖాతా ద్వారా షేర్ చేయబడింది. ఈ చిత్రాన్ని రాష్ట్ర యువసేవలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న స్మితా సబర్వాల్ ఏప్రిల్ 12న తన X ఖాతాలో రీట్వీట్ చేశారు. అయితే, ఇది కంచగచ్చిబౌలి భూముల వివాదానికి సంబంధించి ప్రజల్లో గందరగోళాన్ని కలిగించేలా ఉందని భావించిన గచ్చిబౌలి పోలీసులు, BNSS సెక్షన్ 179 కింద ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ పోస్ట్‌ను రీట్వీట్ చేయడానికి గల కారణాలపై వివరణ ఇవ్వాలని ఆమెను కోరారు.

కంచగచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల భూములపై గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతుండగా, ఈ వ్యవహారాన్ని ఉపయోగించుకుని సోషల్ మీడియా వేదికగా ఏఐ చిత్రాలు, ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం జరుగుతోంది. జింకలు, నెమల్లను బుల్డోజర్లు తరిమేస్తున్నట్టు చిత్రాలు సృష్టించి ప్రజల్లో భయం కలిగించే ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫేక్ న్యూస్‌ను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వాన్ని బద్నాం చేసే విధంగా సోషల్ మీడియాలో అసత్య సమాచారం ప్రచారం చేసిన వారిపై నిఘా పెట్టి, చట్టపరంగా చర్యలు ప్రారంభించింది. ఈ పరిణామాల్లో భాగంగానే, స్మితా సబర్వాల్ చేసిన రీట్వీట్ కూడా విచారణలోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె దీనిపై ఎలా స్పందిస్తారన్నదే రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఈ ఘటన, ఒక ప్రభుత్వ అధికారిణి సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తీకరించడంలో ఉండాల్సిన బాధ్యతా భావాన్ని తిరిగి ప్రశ్నించేలా చేసింది.