HCU భూముల కేసు పై హైకోర్టులో విచారణ – ఏప్రిల్ 24కి వాయిదా


హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల వివాదానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ బెంచ్ ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉందని పేర్కొంది. తద్వారా తదుపరి విచారణను ఏప్రిల్ 24కి వాయిదా వేసింది. అదే రోజున ప్రభుత్వ కౌంటర్ మరియు రిపోర్ట్‌ను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

ఈ కేసులో ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ మేనకా గురుస్వామిను నియమించింది. ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే దిశగా ప్రభుత్వ వాదనలు ఉండనున్నాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరియు కొంతమంది సినిమా ప్రముఖులు పెట్టిన పోస్టులపై కేసులు నమోదు చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రభుత్వం వాదన ప్రకారం, ఈ తప్పుడు వీడియోలు కేవలం ప్రభుత్వానికో సీఎం వ్యక్తిగత ఇమేజ్‌కో నష్టం కలిగించడమే కాకుండా, సమాజానికే పెను ప్రమాదాన్ని కలిగించవచ్చని కోర్టుకు వివరణ ఇవ్వనుంది.