Site icon TeluguMirchi.com

ఈ పాపం ఎవరి ఖాతాలోకి ???

మన రాజకీయాలు కళ కళలాడుతున్నాయో లేదో తెలియదు కాని అన్ని ప్రాంతాల ప్రజలు ప్రాంతాలకతీతంగా విల విలలాడుతున్నారు. అందరికీ ఏదో భయం, అభద్రతా భావం, అయోమయం….ఏ నాయకుడు ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో తెలియదు..ఒకాయన విషం తాగుతానంటాడు…మరొకాయన ఆత్మాహుతి చేసుకుంటానంటాడు… ఇంకొకాయన చెప్పులు మోస్తానంటాడు…మరో నాయకుడు మా ఉద్యోగాలు మీరు కాజేస్తున్నారంటూ ఒక ప్రాంతం వారిని దొంగల్లాగా చూస్తాడు… ఆగమాగం చేస్తాడు… మరో జాతీయ నాయకుడు ఫలానా కండిషన్ మీద ప్రత్యేక రాష్ట్రానికి ఒప్పుకుంటాను అంటాడు ….ఆ ప్రాంతం ప్రజలు అందరూ ఈయనగారి కేదో పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినట్టు…ఇంకో ప్రాంతం మంత్రి గారు మా మీద పెత్తనం చేస్తే ఉద్యమానికి బై చెప్పేస్తామంటూ బెదిరిస్తాడు…మా డిమాండ్ తీరకపోతే వేరే ప్రాంతం ప్రజలకు తాగేందుకు మంచి నీళ్లు కుడా ఇవ్వబోమని వార్నింగు ఇస్తాడు ..ఇంకొకాయన తెలుగు వాచకంలోనో, మరో పుస్తకంలోనో వున్న కొన్ని పేజీలు చించి తగలపెట్టమంటాడు…మరో మహా నాయకుడు అయితే వీరందరి స్థాయిని దాటి వేరే ప్రాంతం ప్రజల్ని తరిమి తరిమి కొట్టమంటాడు…ఇలా దాదాపు అన్ని ప్రాంతాల నాయకులు స్థాయిని..సంస్కారాన్ని మరచిపోయి దాదాలలాగా, గుండాలలాగా ప్రవర్తిస్తున్నారు…వాడొక మాట అంటే…వీడొకమాట అనాలి…సామాన్య ప్రజల మీద, వాళ్ళ మనోభావాల మీద ఈ మాటలు ఎంతటి ప్రభావం చూపిస్తాయో

ఏ నాయకుడికీ అవసరం లేదు…కొంతమంది రెచ్చగొట్టే ప్రసంగాల వల్ల ఆవేశంతో కుర్రాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు… ఈ పాపం ఎవరి అక్క్కౌంట్ లోకి వెళుతుంది..ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి మధ్యన గోడలు కట్టేస్తామనే వ్యాఖ్యలు చేస్తున్న మహా నాయకులు రాష్ట్రాన్ని ఏ దిశగా తీసుకు వెళుతూన్నారో ఆలోచించుకోవాలి..ఉద్యమాలు చేయటం , తమ ఆశయ సాధన కోసం పోరాడటం తప్పు కాదు…కాని ఉద్యమాల స్వరూపం ఇదేనా..?
ఉద్యమ కార్యాచరణ ఇలాగేనా…? బందులు, సమ్మెలు, రైల్ రోకోలు , రాస్తా రోకోలు , ధర్నాలు సగటు మనిషిని ఎంతగా అవస్తల పాలు చేస్తాయో, ఎన్ని జీవితాలు చిద్రమవుతాయో ఉద్యమాలు చేస్తున్న నాయకులకు తెలియదు అనుకుందామా…! వత్తిడి తెస్తోంది ప్రభుత్వాల పైనా… ప్రజల పైనా…! నిరసనలు సర్కారుకా…సామాన్యుడికా…! దాడి పాలకులపైనా..సగటు మనుషులపైనా…? ఎవరు ఆలోచిస్తారు…? ఎవరు అడ్డుకట్ట వేస్తారు…? ఈ దుస్థితిని రాష్ట్ర ప్రజలు ఎప్పటికి అధిగమిస్తారు…? ఇంకా ఎంతమంది ఆత్మాహుతులు చేసుకోవాలి..? ఈ రావణ కాష్టం ఎన్నాళ్ళు…నిప్పుల కొలిమిలా మండుతున్న ఈ రాష్ట్రం ఎప్పటికి చల్లబడుతుంది…? ఎక్కడో ఒకచోట…ఎప్పుడో ఒకప్పుడు చరమగీతం పాడుకోలేమా…? స్వస్తి వాక్యం పలకలేమా…? ఎవరు ఈ స్థితికి కారకులు…ఈ డ్రామాలకు సూత్రధారులు…
కేంద్రమా…రాష్ట్రమా…ఏదేని ప్రాంతానికి చెందినా నాయకులా…ఎవరిని నిందించాలి..? ఎవరిని వేలెత్తి చూపాలి…?ఎవరిని శిక్షించాలి …? ఈ దారుణాలకు తమ జీవితాలను బలిదానం చేసిన వాళ్ళ కుటుంబాలకు ఎవరు సమాధానం చెబుతారు…? ఎవరు ఏ ప్రాంతం వాళ్ళన్నది ఎవరు నిర్ణయిస్తారు…? ఏ ప్రాతిపదిక పైన ఎంపిక చేస్తారు…? ఎన్నో ప్రశ్నలు…కనుచూపు మేరలో కనపడని సమాధానాలు… ? నాలుగయిదు సంవత్సరాల్లో నలభై యాభై ఏళ్ళు వెనక్కు వెళ్ళిన ఆంధ్ర ప్రదేశ్ మ్యాపు ను ఎవరు మళ్లీ మామూలు స్థితికి తీసుకు వస్తారు…? వెనక్కి వెళ్లిపోయిన లక్షలాది ఉద్యోగాలు ఎవరు తెచ్చిస్తారు…?
ఇదేదో ఒక ప్రాంతానికి సంబంధించిన ఉద్యమాన్ని ఉద్దేశించో, ఉద్యమ నాయకుల గురించో నేను స్పందిస్తున్న అంశాలు కావు…ఈ తప్పు అందరిదీ…అన్ని ప్రాంతాల వారిది… ప్రాంతాలకు అతీతంగా రియాక్ట్ అయి రాస్తున్న ఆర్టికిల్ …. అందరూ సంయమనం పాటించి బ్యాలెన్స్ తప్పకుండా ఉద్యమాలు నడుపుకుంటేనే ఏ ఉద్యమానికయినా ప్రజల సానుభూతి లభిస్తుంది… ఆ సానుభూతి లేకుండా ఏ ప్రజా ఉద్యమం విజయం సాధించలేదు అన్నది అందరికీ తెలిసిన వాస్తవం…చరిత్ర చెబుతున్న సత్యం…!!!!

Exit mobile version