Site icon TeluguMirchi.com

ఉరిమి ఉరిమి కమెడియన్ల మీద !

comedyచిన్న సినిమాలు దాదాపు అవసాన దశకు చేరుకున్నాయని బాధపడే వారంతా అందుకు మిగిలిన కారణాలతో బాటు సినిమా నిర్మాణ వ్యయం అనూహ్యంగా పెరిగి పోవటం ఒక కారణంగా చెబుతుంటారు. ఇది నూటికి నూరు పాళ్ళు నిజం. అయితే ఆర్టిస్టులు ప్రధానంగా కామెడి ఆర్టిస్టులు తమ పారితోషికాన్ని తగ్గించుకుంటే ఈ సమస్య దాదాపు పరిష్కారం అవుతుందంటూ చాలామంది సిని విశ్లేషకులు, నిర్మాతలు, మీడియా మిత్రులు చెబుతుంటారు. నాకెందుకో ఈ వాదన కామెడి గా అనిపిస్తుంటుంది. అన్ని రంగాల్లాగానే సినిమా రంగంలో కూడా డిమాండ్ అండ్ సప్లయి సూత్రం వర్తిస్తుంది. ఎవరికీ గ్లామర్ వుంటే వాళ్ళనే తమ సినిమాలలో పాత్రలకు ఎంచుకుంటారు.ఏ ఆర్టిస్టుకయినా కొంతకాలం పీక్ స్టేజి వుంటుంది>అప్పుడే ఆ ఆర్టిస్టు ఎక్కువ పారితోషికాన్ని అడుగుతాడు…నిర్మాతలు కూడా కొన్ని సందర్భాలలో తమ అవసరాన్నిబట్టి డేట్లకోసం వాళ్ళు అడిగినదానికంటే ఎక్కువ కూడా ఇస్తుంటారు. ఇది సహజం. ఇందులో అసాధారణమయిన అంశం కూడా ఏమీలేదు. ఉదాహరణకు బ్రహ్మానందంకు వున్న డిమాండుకు ఆయన కావాలని ప్రతి నిర్మాత, దర్శకుడు అనుకుంటారు.బ్రహ్మానందం వుంటే సినిమాకు హెల్ప్.కమర్షియల్ గా ఆయన పేరు సినిమాకు అవసరం. రచయితలు కూడా కొంతమంది ఇమేజ్, గ్లామర్ వున్న ఆర్టిస్టులను దృష్టిలో పెట్టుకుని పాత్రలు రాస్తారు. కొన్ని సినిమాలలో అయితే హిరో పాత్ర కంటే బ్రహ్మానందం పాత్ర నిడివి, ప్రాధాన్యం ఎక్కువగా వుండటం కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కామెడి ప్రాముఖ్యం పెరిగింది. ఆటోమేటిక్ గా కమెడియన్ ల ప్రాముఖ్యం పెరిగింది. అందుకే బ్రహ్మానందం డిమాండ్ ను బట్టే ఆయన పారితోషికం వుంటుంది. తనను పెట్టుకొమ్మని బ్రహ్మానందం ఎవరి దగ్గరకు వెళ్లి బతిమిలాడ లేదుకదా.బ్రహ్మానందం పారితోషికం ఎక్కువ అనుకుంటే అసలు ఆయన్ను పెట్టుకోకుండా ప్రత్యామ్నాయం చూసుకోవచ్చు కదా. డిమాండ్ వున్న ఏ ఆర్టిస్టుకయినా ఇది అన్వయిస్తుంది. అంతేగాని నిర్మాణ వ్యయం పెరగటానికి దీనికి లింకు పెట్టటం కరెక్టు కాదన్నది నా అభిప్రాయం. కొంతమంది అంటున్నట్టుగా ఇక్కడ త్యాగాలకు ఆస్కారం లేదు. ఇదే కాన్సెప్ట్ హీరోలకు ఇతర ఆర్టిస్టులకు కూడా వర్తిస్తుంది. బిజినెస్ అవుతుందనుకున్న హీరో డేట్లకోసమే ఏ నిర్మాత అయినా ప్రయత్నిస్తారు. ఇది సహజం. కోట్లతో కూడిన వ్యాపారం ఇది. ఎవరు రిస్కు చేస్తారు చెప్పండి. కొంతమంది నిర్మాతలు ముంబాయి హీరోయిన్లకు ఇచ్చే పారితోషికాలు, వాళ్ళ స్టాఫ్ కు ఎగ్జిక్యుటివ్ టికెట్లు, వాళ్ళకు కూడా అయిదు నక్షత్రాల హోటళ్ళు , వాళ్లకు రోజూ సాయంకాలం అయ్యేసరికి ఇచ్చే పాతిక వేలకు పైగా బత్తాలు తగ్గించుకుంటే బోలెడంత ఖర్చు తగ్గుతుంది.నిర్మాతలకు నిజంగా ఇది నిత్య నరకం. ఫైనల్ గా నేను ఎక్స్ ప్రెస్ చేయదలచుకున్నది ఒకటే. జబ్బు ఒకటయితే మందు ఒకటి వాడుతున్నాం.గొంతులో నేప్పికి అరికాలుకు మందు రాస్తున్నాం. ముందు సమస్య ఎక్కడుందో తెలుసుకుని దాని పరిష్కారానికి మందు వాడటం అవసరం. ఇది ఎవరినో విమర్శించటం కాదు.నేను కూడా సినిమా వాడినే కాబట్టి ఈ మాత్రం స్పందించాను.నిర్మాణ వ్యయానికి సంబంధించి ఏ మీటింగు జరిగినా ముందుగా కమెడియన్ ల పేర్లు చర్చకు వస్తుంటాయి కాబట్టి ఇలా రియాక్ట్ అయ్యానంతే. ఏనుగు కుంభస్థలాన్ని కొడితే అదుపులోకి వస్తుంది కాని తోకలాగితే రాదు.

Exit mobile version