సారీ…… దేవుళ్ళూ !!

viswaroopamమొన్నీమధ్యన ఓ టీవిలో చూసిన ఒక వార్త నాకు తిక్క రేగేలా చేసింది. ఏమిచేయాలో అర్ధంకాలేదు. ఏదో ఒకటి చేద్దామన్న కసి, కోపం నా నిలువెల్లా వ్యాపించినాయి. అమెరికాలో ఓ ఊళ్ళో మరుగుదొడ్లల్లోను, కాలి చెప్పులమీద, కట్ డ్రాయర్ల మీద హిందూ దేవతల బొమ్మలనువేసి పిచ్చి గంతులేసిన ముష్కర మూకల వికృత చేష్టలను ఈ మధ్యన ఓ టీవి చానెల్ ప్రసారం చేసింది. నిజం చెప్పాలంటే నా నెత్తురు ఉడికిపోయింది. కొన్ని దేశాలలోని హిందూ వ్యతిరేక ఉన్మాదులు అనేకసార్లు ఇలాంటి దౌర్భాగ్య చేష్టలకు పాల్పడుతున్నా మనం మాత్రం చేష్టలుడిగి చూస్తున్నాం తప్పితే ఏ మాత్రం స్పందించటం లేదు. ఈ దృశ్యాలు చూసిన ఎవరికయినా అరికాలి మంట నెత్తికి ఎక్కుతుంది. మనమే అక్కడుంటే ఆ ఉన్మాదులను స్పాట్ లో ఏమయినా చేసేద్దామన్న పిచ్చి కోపం కొంతమందికి రావటం కూడా అసహజమేమీ కాదు.

ఇది కేవలం హిందూమతానికి సంబంధించింది మాత్రమేకాదు. ఏ మతం వాళ్ళయినా ఇలాగే ప్రతిస్పందిస్తారు. కొంతమంది బయటపడతారు…కొంతమంది లోపల్లోపలే బాధపడతారు. మిగిలిన మతాల వారికి సంబంధించి కూడా ఇలాగే జరుగుతుందేమో నాకు తెలియదు కానీ హిందూ మతానికి, హిందూ దేవుళ్ళకు మాత్రం ఇలాంటి అవమానాలు సర్వ సాధారణమయిపోయాయి.. పట్టించుకునే నాధుడు లేడు…స్పందించే నాయకుడు లేడు . …బహుశా ఇంతటి ఉదార స్వభావం ఒక్క హిందూ మతంలో మాత్రమే ఉందేమో…హిందూ దేవుళ్ళను ఎవరు ఎంత దారుణంగా అవమానిస్తున్నా ఉత్తినే ” అయ్యొయ్యో ” అనో ” రామ రామ ” అనో అనుకుంటాం తప్పితే మర్నాడు దాన్ని మరచిపోతాం. మీడియా కూడా….ఇంతటి సున్నిత అంశాలపైన ఎందుకు ఉధృతంగా రియాక్ట్ కాదో అర్ధం కాని అంశం.

ఎవడో ఒక వెధవ ఎక్కడో ఒక చోట ఇలాంటి పిచ్చి పని చేసినంత మాత్రాన దానిని పెద్దది చేయటం అనవసరం అనుకుంటే అసలు ఇలాంటివి ప్రసారం చేయకుండా ఉంటే బావుంటుందేమో… లేదా ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వచ్చే స్థాయిలో ఎలివేట్ చేయాలి…మరోసారి ఇలాంటి పిచ్చి వేషాలు మరెవరూ వేయకుండా కృషి చేయాలన్నది నా అభిప్రాయం.. ఇలాంటి సందర్భాలలో ఆయా దేశాల రాయబారుల కార్యాలయాలు ఏం చేస్తున్నాయో ? ఆయా దేశాలలోని మన రాయబారులు ఏం చేస్తున్నారో అంతుబట్టని విషయం….అందరికీ పెద్దన్నలా చెప్పుకునే అమెరికా లోనే ఇలా జరగటం, అందుకు అమెరికా సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు ఊర్కోవటం కొన్ని ఇతర ఉన్మాద దేశాలకు ప్రేరణ కాదా…? ఇలాంటి సంఘటనలకు ఎవరెన్ని కారణాలు చెప్పినా, నాది అజ్ఞానమంటూ ఎవరు నిందించినా నేను పట్టించుకోను…నా మతాన్ని నేను గౌరవిస్తా…నా దేవుణ్ణి నేను పూజిస్తా…

హిందూ దేవతలను అవమానించిన వాళ్ళు ఎవరు నాకు దొరికినా మరోసారి వాళ్లిలాంటి పని చేయకుండా బుద్ధి చెబుతా…ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇలాంటి నికృష్టపు పని పునరావృతం కాకుండా జాతీయస్థాయిలో ఉన్నత స్థాయి సంఘాన్ని కేంద్ర ప్రభుత్వమే నెలకొల్పి దానికి చట్టబద్ధత కల్పించాలి. ” ధర్మో రక్షతి రక్షితః ” అన్నది పాత మాట…అంతకంటే ముందు ” దైవో రక్షతి రక్షితః ” అన్నది ఇప్పుడు అవసరమైన మాట….ఇది ఎవరినో రెచ్చ గొట్టేందుకు రాస్తున్నది కాదు….నన్ను నేను నియంత్రించుకునేందుకు రాసుకుంటున్న లేపనం…

” దేవుడూ…! నీకు దిక్కెవరు…? ”