సినిమా వాళ్లయినంతమాత్రాన……!!

Presentation1ఇటివలి కాలంలో ఏ చిన్న వివాదం రేగినా, ఏ నేరం జరిగినా అందులో సినిమావాళ్ళ దగ్గరి పనివాళ్లో, దూరపు చుట్టాలో వుంటే ఆ మొత్తాన్ని సినిమా రంగం మొత్తానికి ఆపాదించటం మీడియాకు ఆనవాయితీగా మారింది. ఎవడో ఒకడు ఏ నేరం చేసో దొరికిపోతే వాడికి ఏ హిరోయిన్ తోనో, హిరోతోనో, చిన్ని సంబంధంవుంటే చాలు…ఆ సెలెబ్రిటి బతుకు చాకి రేవే..దశాబ్దాల పాటు కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ మొత్తం నాశనమే. అందరిలానే సినిమా వాళ్లకుకూడా తమ్ముళ్ళు, అన్నలు, బావలు, బావమరదులు, డ్రైవర్లు, ఘూర్ఖాలు, అసిస్టెంట్లు, వాచ్ మెన్లు వుంటారు. అందరిలానే వాళ్ళు కూడా తప్పులు చేస్తారు…నేరాలు చేస్తారు… సహజం..నేరాలు, శాంతిభద్రతల విషయానికొస్తే సమాజంలో సినిమావాళ్ళు అంటూ ప్రత్యేకమయిన జాతి వేరే వుండదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే..అలా కాకుండా సినిమావాళ్ళతో లింక్ వున్న ఎవడో ఒకడు ఏ మాదక ద్రవ్యం కేసులోనో పట్టుబడితే మొత్తం సినిమా రంగానికి సదరు కేసులో సంబంధం వుందని, ఇందుకు సంబంధించిన మూలాలు ఫిలిం నగర్లో వున్నాయంటూ స్క్రోలింగ్ లు దగ్గర్నించి స్పెషల్ ప్రోగ్రాములు, టాక్ షోలు, చర్చా వేదికలు పెట్టి సినిమారంగం ఇమేజ్ మొత్తాన్ని దెబ్బతీసే పనిని ఓ మహత్తర యజ్ఞంలా చేపట్టడం ఎంతవరకు సబబు అన్నది మీడియానే ఆలోచించాలి. ఒక పోలీసు తాగి రోడ్డు మీద తందనాలు ఆడితే ” మొత్తం పోలీసు శాఖ మత్తులో తేలియాడుతోంది ” అనటం ఎంతవరకు సమంజసం ?
ఒక టిచర్ ఒక విద్యార్ధిని పట్ల ఉన్మాదిలా కామోద్రేకంలో తప్పుగా వ్యవహరిస్తే ” కామంలో కొట్టుమిట్టాడుతున్న ఉపాధ్యాయ రంగం ” అనటం భావ్యమా?

మరో దారుణం ఏవిటంటే….ఉదాహరణకు ఒక వ్యభిచారం నేరంలో ఓ లేడి సినిమా ఆర్టిస్టు దొరికితే ఆవిడ గురించే 24 గంటలు ప్రచారం జరుగుతుంది తప్ప ఆవిడతో పాటు పట్టుబడ్డ పురుషుడి గురించి అస్సలు పట్టించుకోరు…..కారణం…వాడి గురించి ఎంత చెప్పినా ఎవడు చూడడు….ఎవడికి ఆసక్తి వుండదు…రేటింగు పెరగదు….ఎంతసేపటికి సినిమా వాళ్ళ గురించి చెబితేనే టిఆర్పీ పెరుగుతుంది…పైగా ఫలానా హిరోయిన్ తమ్ముడో..హీరో చెల్లెలో ఒక కేసులో ఇరుక్కుంటే టివి ఆఫిసులనుంచి మిగిలిన వారికి టాక్ షో లలో పాల్గొనమని ఆహ్వానాలు….ఫలానా లేడి ఆర్టిస్టు ( ఆవిడ సినిమా ఆర్టిస్టు అయితే చాలు…జూనియర్ ఆర్టిస్టు అయినా సరే…) వ్యభిచారం నేరంలో పట్టుబడింది కదా…మీ స్పందన ఏవిటీ అంటూ ప్రశ్నలు…ఏం చెప్పాలి ? ఈ మధ్య ఇలాంటి ఒక కేసులో ఒక సినిమా ఆర్టిస్టుతో పాటు ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కూడా దొరికాడు.అయితే హిరోయిన్ గురించి తప్పితే ఆ ఇంజినీర్ గురించి ఒక్క చానెల్ కూడా ప్రసారం చేయలేదు…ఇంత ప్రాధాన్యం ఇస్తున్నందుకు సినిమా రంగం మీడియా పట్ల ఎంత కృతజ్ఞతతో వుండాలి..? నిన్నో మొన్నో ఒక మాజీ హిరోయిన్ తమ్ముడు ఓ మాదక ద్రవ్యాల కేసులో పట్టుబడితే పాపం..ఆ హిరోయిన్ పేరు మార్మోగి పోయింది…ఆవిడకు పద్మభూషణ్ పురస్కారం వచ్చినా ఇంత కవరేజ్ వచ్చివుండేది కాదేమో…మళ్లీ మాదక ద్రవ్యాలతో సినిమా రంగానికి లింకు ఉందంటూ వార్తలు…వ్యాఖ్యానాలు…ఈ ధోరణిని మీడియా మరోసారి పునరాలోచించాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం..అంతే..బంధాలు…బాంధవ్యాలు ఉండటం శాపం కాదు… కాకూడదు… ప్రతిసారి ఇలా పరిశ్రమ పరువును బజారున పడేయటం మానుకుంటే మంచిదని నా విజ్ఞప్తి…ఈ విజ్ఞప్తిలో ఏదయినా లోపం వుందని మీడియా భావిస్తే దీనిని వాళ్ళు పట్టించు కోవలసిన అవసరం ఏ మాత్రం లేదు…..!!