Site icon TeluguMirchi.com

మేరా భారత్ మహాన్…

the-proud-indian-మరో పదిహేను రోజుల్లో మళ్ళీ స్వతంత్రం పండగ రాబోతోంది… మామూలుగానే గవర్నమెంటు సెలవు . జెండాలు ఎగరేస్తాం . చాక్లెట్లు గట్రా పంచుతాం . హాలిడే కాబట్టి మల్టీప్లెక్సులన్నీ కుర్రాళ్ళు,ఫ్యామిలీలతో ఫుల్లయిపోతాయి . ముఖ్యమంత్రి గారేమో హైదరాబాదులోనూ, మన్మోహన్ గారేమో ఢిల్లీలోనూ మూడురంగుల జెండాలెగరేసి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు . అన్ని రాజకీయ పార్టీల ఆఫీసుల్లోనూ ,సర్కారు ఆఫీసుల్లోనూ, కొన్ని రహదార్ల చౌరాస్తాల్లోనూ జెండాలెగరేసి జనగణమన పాట ఎంతవరకు వస్తే అంతవరకు పాడి దేశానికి బోల్డంత సేవచేశామనుకొని ఇళ్ళకు వెళ్ళటం మామూలే . పత్రికలు ఈ ఒక్క రోజు తమ లోగోలను , టీవీ చానెళ్ళ వాళ్ళూ తమ ఎంబ్లెంలను మువ్వన్నేలతో నింపటం కూడా సాధారణం . అన్నీ బానే ఉన్నాయి . కానీ
ఏదో మొక్కుబడిగా జరిగే ఈ ప్రహసనంలో ఏదో తెలియని అవాస్తవం …. అస్పష్టత … అన్ నాచురాలిటీ… ఆత్మవంచన… ఆగస్టు పదిహేను వస్తేనే స్వతంత్రదినం గుర్తొచ్చే మనలో ఎంతమందికి జెండా ఎందుకు ఎగరేస్తున్నమో తెలుసో చెప్పండీ . అసలు స్వతంత్రం ఎందుకొచ్చిందో , ఎలా వచ్చిందో తెలియక చాక్లెట్లు తింటున్న పిల్లలకూ ….. వాళ్ళకు ఎందుకు స్వీట్లు పంచుతున్నామో తెలియచెప్పాలన్న ఆలోచన లేని పెద్దవాళ్ళకూ .., తనెందుకు ఎగురుతున్నానో తెలియని జెండాతల్లి ఏమని చెప్తుంది చెప్పండి . స్వతంత్రం పండగరోజు ఆ వేడుకలను చూడటానికి వచ్చే వాళ్ళు హ్యాండుబ్యాగులు , టిఫిన్ బాక్సులు తీసుకురావద్దంటూ ఓ పోలీసు అధికారి ఆదేశించాడంటే మనం ఎంత బిక్కు బిక్కు మంటూ స్వతంత్ర వేడుకలను జరుపుకొవలసిన ఖర్మ ఈ దేశానికి ఎందుకు పట్టిందన్న ప్రశ్నకు దివంగతులైన ఏ సమరయోధుడి ఆత్మ సమాధానం చెబుతుంది చెప్పండి . మూడురంగుల జెండాలో కాషాయం పైన వుంటుందో గ్రీన్ కలర్ పైవైపుంటుందో ఈ దేశంలో చాలామంది రాజకీయనాయకులకు తెలియదంటే ఆశ్చర్యపడదామా ? సిగ్గుపడదామా ? ఇలా తలచుకుంటూ … తవ్వుకుంటూ పోతే ఎన్నో గుర్తొస్తున్నాయి … కలచివేస్తున్నాయి … అన్నీ దిగమింగుదాం … అన్నీ జీర్ణించుకుందాం… ఇదీ ” తల్లి భారతి ” దురదృష్టం అని సరిపెట్టుకుందాం … ఎంచక్కా జెండా ఎగరేద్దాం… అన్నీ అబర్ధాలని తెలిసికూడా రాజకీయ నాయకుల ఉత్తేజపూరిత ఉపన్యాసాలు విని చప్పట్లుకొట్టి ఇంటికి వచ్చి సాయంకాలం ఫ్యామిలీతో ఏ మల్టీప్లెక్స్ కో వెళదాం … పిచ్చి జెండా … గాలివున్నంతసేపు ఎగురుతుంది… ఎగరనివ్వండి… మనం పట్టించుకోక పోయినంతమాత్రాన మహాత్మాగాంధీ గారో … వావిలాల గోపాలకృష్ణయ్య గారో వచ్చి మనల్ని అడగరు కదా … ఎంజాయ్ …
మేరా భారత్ మహాన్…

Exit mobile version