Site icon TeluguMirchi.com

మ‌గ‌ధీర త‌ర‌వాత ఎవ‌డు సినిమానే: చిరంజీవి

Yevadu-Audio-Launchరామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ఎవ‌డు. వంశీపైడి ప‌ల్లి ద‌ర్శక‌త్వం వహించారు. దిల్ రాజు నిర్మాత‌. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాలు సోమ‌వారం రాత్రి హైద‌రాబాద్ లోని శిల్పక‌ళా వేదిక‌లో అంగరంగ వైభ‌వంగా విడ‌ద‌ల‌య్యాయి. తొలి సీడీని చిరంజీవి ఆవిష్కరించారు. తొలి సీడీ రామ్‌చ‌ర‌ణ్ బ‌న్నీ స్వీక‌రించారు.

అనంతరం చిరంజీవి మాట్లాడుతూ ”రాజ‌కీయాల‌తో బిజీగా ఉంటున్నాను. ఇలా ఈ సంద‌ర్భంలో అభిమానుల ముందుకు రావ‌డం చాలా సంతోషంగా ఉంది. రెండు సంవ‌త్సరాల క్రితం వంశీపైడిప‌ల్లి ఈ క‌థ నాకు చెప్పాడు. చాలా బాగుంది. స‌రిగా తీస్తే సూప‌ర్ హిట్ అన్నాను. అలాగే తీశాడు. నిన్న ఈ సినిమా ర‌షెష్ చూశా. ఆద్యంతం ఉత్కంఠ‌త‌కు గుర‌య్యా. మ‌గ‌ధీర త‌ర‌వాత‌.. న‌న్ను అంత‌గా ఆక‌ట్టుకొన్న సినిమా ఇది. ప‌వ‌న్ విదేశాల్లో ఉన్నాడు. ఈ కార్యక్రమానికి రాలేక‌పోయాడు. ఈ సినిమా సిల్వర్ జూబ్లీ వేడుక‌కు క‌చ్చితంగా వ‌స్తాడు. ఈ సినిమాలో బ‌న్నీ ఉండేది అయిదు నిమిషాలే కానీ సినిమా అంతా క‌నిపిస్తాడు. బ‌న్నీ, చ‌ర‌ణ్‌ల మ‌ధ్య అంత‌లా కెమిస్ట్నీ కుదిరింది” అన్నారు.

”మ‌గ‌ధీర త‌ర‌వాత అలాంటి సినిమా కెరీర్‌లో ఎప్పుడొస్తుందా?? అనిపించింది. అది ఎవ‌డు రూపంలో వ‌చ్చింది. ర‌చ్చ స‌మ‌యంలో వంశీ నాకు ఈ క‌థ చెప్పాడు. చెప్పగానే హ‌త్తుకొన్నా. ఇంత మంచి క‌థ నా అభిమానుల‌కు ఇచ్చినంద‌కు చాలా థ్యాంక్స్‌” అని చ‌ర‌ణ్ చెప్పాడు.

బ‌న్నీ మాట్లాడుతూ ”ఈ సినిమాలో నేను కేవ‌లం అయిదు నిమిషాలు మాత్రమే ఉంటా. ఇది నూటికి నూరు పాళ్లు చ‌ర‌ణ్ సినిమా. మ‌గ‌ధీర త‌ర‌వాత అంత పెద్ద సినిమా ఇంత త్వర‌గా రావ‌డం రామ్‌చ‌ర‌ణ్ అదృష్టం” అన్నాడు.

ఈ కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు సీతారామ‌శాస్త్రి, మారుతి, భోగ‌వ‌ల్లి ప్రసాద్‌, సాయికుమార్, వ‌క్కంతం వంశీ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Exit mobile version