Site icon TeluguMirchi.com

రాయల తెలంగాణ ఇచ్చేద్దామా…?

rayala telanganaతెలంగాణ విషయాన్ని తేల్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే, అధిష్టానం దృష్టిలో మూడు అంశాలున్నట్లుగా తెలుస్తోంది. 1) హైదరాబాద్ తో కూడిన తెలంగాణ 2) రాయల తెలంగాణ 3) తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ. అయితే, ఈ మూడు ఆప్షన్లలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రెండవ అంశానికి ఎక్కువ ప్రాధ్యానత ఇస్తోందని సమాచారం. ఈ మేరకు ఇటీవల జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో అధినేత్రి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీంతో.. జగన్ పార్టీని ఒక ప్రాంతానికి పరిమితం చేయడంతో పాటుగా, తెరాసను విలీనం చేసుకునే దిశగా కూడా అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ అంశాన్ని తేల్చేందుకే.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ ఛీఫ్ బొత్సలను ఢిల్లీకి పిలిపించి మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. అయితే, ముఖ్యమంత్రి కిరణ్ మాత్రం తెలంగాణ అంశాన్ని స్థానిక ఎన్నికలకు ముందే తేల్చేయాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లు సమాచారం. కాగా, అధినేత్రి సోనియా మాత్రం హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఇచ్చేందుకే మొగ్గు చూపుతున్నట్లు, తద్వారా ఆంధ్రా ప్రాంతానికి ప్యాకేజీ ప్రకటించాలని చూస్తున్నట్లు కూడా కొన్ని టీవి ఛానెళ్లు ప్రసారం చేస్తున్నాయి.

ఏ నిర్ణయాన్ని ప్రకటించిన ఈ పది-పదిహేను రోజుల్లో నిర్ణయం మాత్రం వెలువడే అవకాశాలున్నట్లు కేంద్ర నేతలు అనుకుంటున్నారు. తెలంగాణ అంశాన్ని ఇంకా ఆలస్యం చేయడం ఏమాత్రం మంచిది కాదని, అధిష్టానం నిర్ణయాన్ని ప్రకటించిన అనంతరం అవసరమైతే.. నాయకత్వ మార్పునకు కూడా చేసే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Exit mobile version