నాని సవాలు వెనుక ఎవరున్నారు…??

గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని తెలుగుదేశం పార్టీ పైనా, నందమూరి బాలకృష్ణ పైనా అంతగా రెచ్చిపోవటానికి కారణం ఏమిటి ? ఉన్నట్టుండి నానికి అంత ధైర్యం ఎలా వచ్చింది ? దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్. కు వీరాభిమాని అయిన నాని నోటివెంట నందమూరి ఫ్యామిలీ కి వ్యతిరేకంగా అంతటి తీవ్ర వ్యాఖ్యలు ఎలా వెలువడ్డాయి.? నాని వెనుక ఎవరున్నారు….? తెలుగుదేశం పార్టీ లోనూ, కృష్ణా జిల్లాలోనూ మాత్రమే కాకుండా రాష్ట్ర రాజకీయ వేదికల మీద కూడా ప్రస్తుతం ఇదే చర్చ కొనసాగుతోంది. హీరో జూనియర్ ఎన్.టి.ఆర్.కు అత్యంత సన్నిహితుడిగా వున్న నానిలో సడెన్ గా ఇంత తెగింపు ఎలా వచ్చింది.? ఒక పక్క జూనియర్ కూడా తన ధోరణిని మార్చుకుని మామయ్య చంద్రబాబుకు , పార్టీ కి విధేయుడిగా వున్నాడు… బాబు పాదయాత్రకు కూడా జూనియర్ వెళ్లి నైతిక మద్దతును ప్రకటించి వచ్చాడు. ఖాళీ రోజు చూసుకుని కొద్ది రోజులు బాబు వెంట నడుస్తానని చెప్పాడు. రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధిస్తుందని, చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని, తాను స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని దేశం విజయానికి కృషి చేస్తానని ఎన్నో పర్యాయాలు జూనియర్ మీడియా ముందు చెప్పారు. ప్రస్తుత పరిస్థితులలో తాను చంద్రబాబు వైపు ఉండాల్సిన అవసరాన్ని జూనియర్ సరైన సమయంలో గుర్తించాడు. మరి నాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి వెళుతున్నప్పుడు జూనియర్ తో సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నాడా…. చెపితే జూనియర్ వెళ్ళవద్దని చెప్పలేదా? చెప్పినా లెక్క చేయకుండా నాని జగన్ వెంట అడుగులు వేశాడా… అలా జరిగివుంటే ప్రస్తుతం జూనియర్ కూ నానీకి మధ్య స్నేహం దెబ్బతిన్నదా? అన్న అనుమానం రాకమానదు. బాలకృష్ణ మీద పోటీచేసి ఒకవేళ ఓడిపోతే రాష్ట్రం విడిచి వెళ్లి పోతాను అనేంత సవాలు విసరటంలో నాని సాహస నేపధ్యం ఏమైవుంటుందన్న ప్రశ్నకు సమాధానాల కోసం రాజకీయ విశ్లేషకులు వెదుకుతున్నారు.

నానికి సొంతంగా గుడివాడ నియోజకవర్గంలో క్యాడర్ ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి, నందమూరి ఫ్యామిలికి కంచుకోటగా నిలుస్తూ వస్తోంది. ఇదే నియోజకవర్గం నుంచి రెండుసార్లు నాని దేశం జెండా పట్టుకుని గెలిచాడు కూడా… ఇప్పుడు అకస్మాత్తుగా ఆయన పార్టీ ఎందుకు మారారో ఎవరికీ అర్ధం కాని విషయం. రానున్న ఎన్నికలలో తెలుగుదేశం బలం కన్నా, తన సొంత ఇమేజ్ కన్నా, జగన్ హవా బలంగా ఉంటుందన్న ఆలోచనతోనే ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారనేది స్పష్టం అవుతోంది. తన రాజకీయ భవితవ్యానికి జగన్ పార్టీయే ఉత్తమమని నాని భావించి ఉంటారనేది నిర్వివాదాంశం. ఈ నేపధ్యంలో గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి ఇంత స్థాయిలో చర్చ జరపటం ద్వారా మొత్తం అంశాన్ని జగన్ దృష్టికి తిసుకువెళ్ళవచ్చని, తద్వారా రానున్న ఎన్నికల సమయానికి వేరెవరూ జగన్ పార్టీ తరపున తనకు పోటీ ఉండకుండా కట్టుదిట్టం చేసుకోవచ్చునన్నది నాని వ్యూహంగా అనిపిస్తోంది. అందుకోసమే నాని బాలయ్య మీద అంత తీవ్ర స్థాయిలో సవాళ్లు విసిరారని అనుకుంటున్నారు. ఈ సవాళ్ళ వెనుక జగన్ అభయం ఉందా అన్న వ్యాఖ్యలు సైతం వినిపిస్తున్నాయి. రానున్న ఎన్నికలలో గుడివాడ స్థానంలో నాని ఎవరితో తలబడబోతున్నారో, ఎవరు నాని పై పోటికి దిగుతారో, అసలు నానికి జగన్ గుడివాడ స్థానాన్ని ఇస్తారో, ఇవ్వరో అన్న ప్రశ్నలకు సమాధానాలు మరికొంత కాలం తరువాత గాని లభించవు.