కరోనా వైరస్ కారణంగా చిత్రసీమ అల్లకొల్లలం అవుతుంది. సినిమా షూటింగ్ లు ఆగిపోవడం , థియేటర్స్ మూతపడడం తో నిర్మాతలకు ఏంచేయాలో అర్థంకావడం లేదు. కోట్ల రూపాయిలు పెట్టుబడి పెట్టి సినిమాలు చేస్తే …ఇప్పుడు అవి రిలీజ్ కాకుండా ల్యాబ్ కే అంకితం కావడం తో వారంతా లబోదిబోమంటున్నారు.
ఈ లాక్ డౌన్ కారణంగా ఓటీటీ సంస్థలకు భారీగా సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరుగుతోంది. ఈ సంస్థలు కూడా ఓ సినిమాకు మంచి ఆదరణ ఉంటుందని భావిస్తే మంచి ఆఫర్‌ను నిర్మాత ముందుంచుతున్నారు. తాజాగా బాహుబలి నిర్మాతలు కేరాఫ్ కంచరపాలెం వంటి డిఫరెంట్ సినిమాను తెరకెక్కించిన వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. మంచి పాజిటివ్ బజ్ తెచ్చుకుంది. వీక్షకుల నుంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి. చిత్రంలోని ఉమా మహేశ్వర రావు పాత్రలో సత్యదేవ్ జీవించాడని అందరూ కొనియాడుతున్నారు. డిజిటల్‌లో భారీగా వ్యూస్‌ను రాబడుతోంది ఈ సినిమా.
ఈ నేపథ్యంలో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా శాటిలైట్ రైట్స్ మంచి ధరకు అమ్ముడయ్యాయి. కొత్త సినిమా శాటిలైట్ రైట్స్ కొనే విషయంలో సహజంగా మా టీవీ, జీ తెలుగు, జెమినీ టీవీ వంటి ఛానల్స్ పోటి పడి కొంటాయి. కానీ ఈసారి భిన్నంగా ఈ సినిమాను కొనేందుకు ఈటీవీ ఇంట్రస్ట్ చూపించింది. ఈ టీవీ యాజమాన్యం ఈ సినిమా శాటిలైట్ హక్కులను దాదాపు 2.5 కోట్లకు కొన్నట్లుగా సమాచారం. అంతేకాదు అతి త్వరలోనే ఈ మూవీ ఈటీవీలో ప్రసారం అవ్వనుందట. కాగా ఈ చిత్ర మొత్తం బడ్జెట్ కూడా రెండు కోట్లు కాకపోవడం గమనార్హం.