కరోనా వైరస్ కారణంగా గత మూడు నెలలుగా షూటింగ్ లు బంద్ కావడం తో సినీ కార్మికులు , నటి నటులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రకటించిన సడలింపుల్లో భాగంగా మళ్లీ షూటింగ్ లు మొదలుకాబోతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో షూటింగ్ లకు పర్మిషన్ రాగా..తమిళనాట కూడా సీరియల్స్ షూటింగ్ మొదలుకాబోతున్నాయి.
రాష్ట్రంలో టీవీ సీరియల్స్ షూటింగ్ ఈ నెల 10 నుంచి కరోనా నిరోధక నిబంధనలతో ప్రారంభమవుతుందని బుల్లితెర కళాకారుల సంఘం కార్యదర్శి, ప్రముఖ సినీనటి ఖుష్బూ తెలిపారు. టీవీ సీరియల్స్ షూటింగ్‌లో నటీనటులతో సహా 60 మంది వరకు పాల్గొనేందుకు ప్రభుత్వం అనుమతించిందని ఆమె పేర్కొన్నారు.
షూటింగ్‌లో నటిస్తున్నప్పుడు మాత్రమే నటీనటులు మాస్కులు ధరించరని, తక్కిన సమయాల్లో తప్పకుండా మాస్కులు ధరించాలన్నారు. అదే విధంగా షూటింగ్‌లో పాల్గొనే నటీనటులు, దర్శకులు, కెమెరామెన్ సహా 40 మంది తమ ఇళ్ళ నుంచే భోజనాలు తెచ్చుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. షూటింగ్ స్థలాల్లో, ప్రత్యేకించి స్టూడియో ఫ్లోర్లలో తరచూ క్రిమినాశని చల్లాలని, షూటింగ్‌లో పాల్గొనే 40 మంది తరచూ శానిటైజర్లతో నాలుగైదుసార్లు చేతులను శుభ్రంగా కడగాలని ఖుష్బూ తెలిపారు.