తెలుగు చిత్రసీమలో మరో విషాదం నెలకొంది. ఈ నెలలో ఇప్పటికే ప్రముఖ దర్శకుడు కే విశ్వనాథ్, వాణీ జయరాం, తారకరత్న మృతి చెందగా.. తాజాగా మరో ప్రముఖుడు కన్నుముూశారు. ప్రముఖ సినీ ఎడిటర్ జీజీ కృష్ణారావు మృతి చెందారు. ఇవాళ ఉదయం బెంగుళూరులోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు.
దాదాపుగా 200 పైగా సినిమాలకు ఎడిటర్ గా పనిచేసారు. దాసరి నారాయణరావు, K విశ్వనాథ్, బాపు, జంధ్యాల.. లాంటి సీనియర్ స్టార్ దర్శకుల వద్ద ఆయన పనిచేశారు. ముఖ్యంగా K విశ్వనాథ్ గారి చాలా సినిమాలకు కృష్ణారావు ఎడిటర్ గా పనిచేశారు. శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, సూత్రధారులు, శుభసంకల్పం, స్వరాభిషేకం.. ఇలా K విశ్వనాధ్ గారు తెరకెక్కించిన చాలా సినిమాలకు ఆయన ఎడిటర్ గా పనిచేసి మూడు సార్లు నంది అవార్డుని కూడా గెలుచుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకి ఎంతో సేవ చేసిన జీజీ కృష్ణారావు మరణంతో టాలీవుడ్ మరోసారి షాక్‌కి గురయ్యింది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.