ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లు ప్రవేశపెట్టిన సీఎం

అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఈరోజు (శుక్రవారం) ప్రారంభం అయ్యాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభ ప్రారంభం కాగానే ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై రేపు, ఎల్లుండి ఓటింగ్ జరగనుంది. ఈ సందర్భంగా సీఎం ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక తీరు తెన్నులను సభకు వివరిస్తూ… సమాజంలో ఎస్సీ, ఎస్టీలకు సమాన అవకాశాలు, గౌరవం కల్పించేందుకు ఉద్దేశించే ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ చట్టం అమల్లోకి రానున్నట్లు సీఎం తెలిపారు.

ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధుల ఖర్చు కావటం లేదని, ఆ నిధులు ఇతర రంగాలకు మళ్లాయని ఆయన చెప్పారు. సబ్ ప్లాన్ బిల్లును ఎస్సీ, ఎస్టీల నిధులు వారికే ఖర్చు చేసేలా రూపొందించినట్లు పేర్కొన్నారు. అప్పుడే ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేసినట్లు అవుతుందన్నారు. కాగా రేపు, ఎల్లుండి బిల్లుపై చర్చ, ఆ తర్వాత ఓటింగ్ ఉంటుంది. మధ్యాహ్నం మూడు గంటల్లోపు బిల్లుపై సలహాలు, సూచనలు, సవరణలు ఏమైనా ఉంటే అందజేయాలని స్పీకర్ సభ్యుల్ని కోరారు. సభ ముందు బిల్లుకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ నివేదికను ఉంచాలని మజ్లిస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే సభ రేపటికి వాయిదా పడింది.