నటుడు సమీర్‌ ఆత్మహత్య

బాలీవుడ్ చిత్రసీమలో వరుస మరణాలు షాక్ కు గురి చేస్తున్నాయి. ఒకరి మరణ వార్త వినేలోపే మరొకరు మృతి చెందుతున్నారు. నటుడు సమీర్‌ శర్మ(44) మృతి చెందాడు. ముంబైలోని మలాద్‌లో అద్దెకుంటున్న ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సమీర్‌ ఫ్లాట్‌కు చేరుకోగా.. అప్పటికే కుళ్లిపోయిన మృతదేహం దర్శనమిచ్చింది.

దీంతో రెండు, మూడు రోజుల క్రితమే అతడు మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సూసైడ్‌ నోట్‌ సహా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం అతడు ఓ ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమవుతున్న యే రిష్తే హై ప్యార్‌ కే సీరియల్‌లో నటిస్తున్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరిలో అతడు ముంబైలోని వెస్ట్‌ మలద్‌లో గల చించోలి బండర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో అద్దెకు దిగాడు. కారణమేమిటో తెలియదు గానీ ఆగష్టు మొదటి వారంలో తన ఫ్లాట్‌లో విగతజీవిగా తేలాడు. కానీ తలుపులు మూసి ఉండటంతో ఎవరూ ఈ విషయాన్ని గమనించలేదు. అయితే సమీర్‌ ఫ్లాట్‌ నుంచి దుర్వాసన రావడంతో వాచ్‌మెన్‌ పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. తలుపులు తెరచి చూడగా.. కిచెన్‌లో సమీర్‌ ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఈ క్రమంలో పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.