తెలంగాణాకు సమైక్యాంధ్ర కరచాలనం

తెలంగాణా రాష్ట్ర సాధనే జీవితధ్యేయం … అందుకోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం అనే నాయకుడు ఒకరు….. సమైక్యాంధ్రప్రదేశ్‌ మన జన్మహక్కు… రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే చూస్తూ ఊరుకోం… ఎంతకైనా తెగిస్తాం.. అంటూ చెప్పుకు తిరిగే నాయకుడు మరొకరు… నిత్యం ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు, దూషణలు వగైరాలతో దుమ్మెత్తి పోసుకుంటూ పత్రికల్లో, టీవీ ఛానళ్ళలో వ్యతిరేక పర్వాలు కొనసాగిస్తూ ఉన్నారు. సాధారణంగా ఒకరికొకరు ఎదురుపడరు. ఒకవేళ ఎదురుపడ్డారో, ఇంకేముందీ రణరంగమయిపోతుందేమో అని అందరూ భయపడుతూ ఉంటారు. అయితే అనుకోకుండా ఒకరికొకరు ఎదురు పడ్డారు. ఉద్రిక్తమైన పరిస్థితులు ఉత్పన్నమవుతాయేమో అని అనుకున్న అందరి ఉహలపై మల్లెపూలు చల్లినంత పనయింది. ఇద్దరి ముఖాల్లో చిరునవ్వులు… ఆప్యాయమైన పలకరింతలు… పరస్పర కరచాలనంతో పులకరింతలు…. ఇది చాలదన్నట్లు సినిమాల్లో చూపించినట్లు సింబాలిక్‌ గా బ్యాక్‌ గ్రౌండ్‌ లో ఎగురుతూ ఓ శాంతి కపోతం… ఇద్ధరి మధ్యలో శాంతి చిహ్నంగా చెల్లెమ్మ ముసిముసి నవ్వులు… శుభం కార్డు పడిపోయింది.

ఇంతకీ ఇదేదో ఊహాచిత్రం కాదండోయ్‌! అక్షరాలా భారతదేశ పార్లమెంట్‌ భవనం సాక్షిగా జరిగిన యదార్థగాథ. తెరాస అధినేత కే.సీ.ఆర్‌, సమైక్యాంధ్ర నినాదాన్ని భుజాలపై మోసుకొస్తున్న లగడపాటి రాజగోపాల్‌… ఈ ఇద్దరూ పార్లమెంట్‌ సమావేశాలకు హాజరైన సందర్భంగా ఒకరికొకరు ఎదురుపడినప్పుడు జరిగిన సంఘటన…

బహుశా దీన్నే రాజ”నీతి” అంటారేమో……!