వర్మ.. బండారం బయటపడింది!

కాదేదీ వ్యాపారానికి అనర్హం…. అనేది వర్మ సిద్దాంతం. ప్రపంచం తగలడిపోతున్నా దాన్ని కుడా తన సినిమాకి సింబాలిక్ షాట్ గా వాడుకునే తెలివితేటలు తనకు మాత్రమే వున్నాయని అవకాశం వచ్చిన ప్రతీసారీ నిరూపించుకున్నాడు. ఇప్పుడు ముంబై తాజ్ హోటల్ పై జరిగిన దాడులని సినిమాగా తీసి…. అందులో చనిపోయిన వారి శవాలపై చిల్లర ఏరుకునే పనిలో వున్నాడు. తాజ్ పై దాడి అనంతరం విలాస్ రావు దేశ్ ముఖ్ తో సహా తాజ్ హోటల్ని వర్మ సందర్శించిన సంగతి అందరికీ  తెలిసిందే. మరణించిన వారి కుటుంబాలు శోక  సముద్రంలో వుంటే… సంఘటనా స్థలంలో తనకు కావలసిన ‘మసాలా’ వెతుక్కునాడు వర్మ. ఆ రోజు మాత్రం  మైకు ముందు.. “నేను సినిమా కోసం ఇక్కడికి రాలేదు” అని తన తప్పు కప్పి పుచ్చుకునే ప్రయత్నాలు చేసాడు. ఇప్పుడు తన బండారం మరో సారి బయటపడింది. ముంబై తాజ్ దాడుల సంఘటనని సినిమాగా తీసేశాడు. అదే…. “26/11”. గుట్టు చప్పుడు కాకుండా షూటింగ్ పూర్తి చేసి ఇప్పుడు జనం మీదకు వదలడానికి సిద్దమవుతున్నాడు. కసబ్ ని ఈ మధ్యే వురి తీసారు. ఆ సన్నివేశాన్ని కుడా… సినిమాలో జోడించి ఘాటు  పెంచాడట. “తాజ్ పై కాదు… యావత్  దేశం పై జరిగిన దాడి. సంఘటన వెనుక నిజా నిజాలను సినిమా ద్వారా చెప్పాలనుకుంటున్నా.  కసబ్ ఊరితో ఈ కధకు మంచి ముగింపు లభించింది” అని వర్మ చెబుతున్నాడు.
చరిత్రని వక్రీకరించడం వర్మ కు వెన్నతో పెట్టిన విద్య. ‘రక్త చరిత్ర’ సినిమానే అందుకు నిదర్శనం. నిజజీవితంలో  విలన్లను ఆయన వెండి తెరపై హీరో గా చూపిస్తుంటారు. ఈ సినిమాతో కసబ్ ని వర్మ హీరో గా పరిచయం చేసినా షాక్ కి గురి కావలసిన అవసరం లేదు. అసలు నిజా నిజాలను బయట పెడతా… అంటున్న వర్మ… ఈ ఉదంతం లో ఏ విషయాన్ని కెలకబోతున్నాడు? ముంబై దాడులని ఒక్కసారి కుడా పత్రికా ముఖంగా ఖండిచని వర్మకు.… తన సినీ వ్యాపారం కోసం మాత్రం ఆన్ని వాడుకునే ఆర్హత ఉందా? కసబ్ వురి గురించి ఒక్కసారి కూడా మాట్లాడని వర్మ కు.. ఇప్పుడు ప్రేమ పొంగుకొచ్చిందా ? సినిమా షూటింగ్ గుట్టు చప్పుడు కాకుండా పూర్తి చేయవలసిన అవసరం ఏమిటి? కసబ్ మరణం తరవాత ఆ సంగతి బయట పెట్టడం ఏమిటి? వందల మంది చావుని, ఆ సంఘటనలో అసువులు బాసిన.. నిజాయితీ గల పోలీస్ అధికారుల త్యాగాన్నీ వ్యాపారం చేసుకునే వర్మని ఏమనాలి?