Site icon TeluguMirchi.com

మతం మారారో.. కులం ఉండదు..!

Even-Religion-Changed-casteమద్రాసు హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. మతం మారుతూ.. కూడా కులానికి సంబధించిన రిజేర్వేషన్స్ ను అనుభవించే వారికి చెంపపెట్టాలా న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. ఒక మతంలోని వారు మరో మతంలోకి మారితే… అతనికి పాత మతంలోని కులం వర్తించదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. వెనుకబడిన తరగతికి చెంది, మతం మారిన ఓ మహళ తనకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ.. దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ ను విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెల్లడించింది. మతం మారినా తనకు వెనకబడిన తరగతి కింద ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్న పిటిషనర్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. “ఒక వ్యక్తికి వెనుకబడిన కులం అనేది పుట్టుకతో వస్తుందే తప్ప, అది సామాజిక హోదా కాదు. మతం మారడం ద్వారా అంతకు ముందున్న కుల ముద్ర నుంచి సదరు వ్యక్తి విముక్తుడవుతాడ”ని కోర్టు స్పష్టం చేసింది.

మతం మారిన వారికి కూడా రిజర్వేషన్లను కొనసాగించినట్లయితే.. వెనుకబడిన తరగతులు అన్న విధానానికి అర్థమే ఉండదని న్యాయస్థానం అభిప్రాయపడింది. అలాగే మతం మారిన వారికి కులం లేదని 1952లోనే మద్రాస్ హైకోర్టు ధర్మాసనం పేర్కొన్న విషయాన్ని కూడా న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.

కాగా, ఈ కేసుకు సంబంధించి పిటిషనర్ యాస్మిన్ వెనుకబడిన తరగతికి చెందిన క్రిస్టియన్ నాడార్ కుటుంబంలో జన్మించింది. ఈమె ఇస్లాం స్వీకరించి, ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది. 2012లో గ్రూపు-4 ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. అప్పటికే ఆమెకు 30 ఏళ్లు నిండాయి. అయితే రిజర్వేషన్ కేటగిరీ కింద వయసులో ఐదేళ్ల సడలింపు ఆధారంగా రాత పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. అయితే, క్రిస్టియన్ నుంచి ఇస్లాం మతంలోకి మారినందున ఆమెను ఓసీ కేటగిరీలోకి మారుస్తామని.. దీంతో రిజర్వేషన్ వర్తించదని కౌన్సెలింగ్ అధికారులు స్పష్టం చేయడంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది.

మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంది విద్యార్థులు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తుంటే.. మతం మారి కూడా కులం రిజర్వేషన్ ఫలాలను ఆస్వాదించడంపై సమాజంలో ఎప్పటి నుంచో చర్చజరుగుతోంది. తాజాగా హైకోర్టు తీర్పుతో మతం మారారో.. కులం ఉండదనే విషయం స్పష్టమైంది.

Exit mobile version