మహిళా ఎంపీతో కంటతడి పెట్టించిన వెంకయ్య

venkiah-naiduభాజాపా సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు గురువారం రాజ్యసభలో సహనం కోల్పోయారు. మల్టీబ్రాండ్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్ డీఐ)పై చర్చ సందర్భంగా తన ప్రసంగానికి అడ్డుతగిలిన కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీ ప్రభా ఠాకూర్ (రాజస్థాన్) పై అనుచిత వ్యాఖ్య చేశారు. ప్రభా ఠాకూర్ ను ఉద్దేశించి ‘బేవకూఫ్’ (మూర్ఖురాలు) అని నోరుపారేసుకున్నారు. వెంకయ్య వ్యాఖ్యతో కలత చెందిన ఆమె సభలో ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. దీనిపై సభలో తీవ్ర దుమారం రేగింది. అయితే వెంకయ్యనాయుడు క్షమాపణ చెప్పాలంటూ అధికారపక్ష సభ్యులు వాగ్వాదానికి దిగడంతో సభను రాజ్యసభ ఉపాధ్యక్షుడు కురియన్ 10 నిమిషాలపాటు వాయిదా వేశారు. ఈ విరామ సమయంలో వెంకయ్య నాయుడు ప్రభా ఠాకూర్ ని కలిసి క్షమాపణ చెప్పినట్లు తెలిసింది. సభ తిరిగి ప్రారంభమైన కొన్ని నిమిషాల తర్వాత వెంకయ్యనాయుడు తన వ్యాఖ్యపట్ల విచారం కూడా వ్యక్తం చేస్తూ.. ఉద్దేశపూర్వకంగా తాను ఆ మాట అనలేదన్నారు. దీంతో డిప్యూటీ చైర్మన్ పి.జె. కురియన్ ఆ పదాన్ని రికార్డుల నుంచి తొలగించారు.