ప్రివ్యూ : సారొచ్చారు

ప్రివ్యూ : సారొచ్చారు

saarocharu-movie-latest-stills-1మాస్ మాహారాజా రవితేజ మరోసారి ప్రేక్షకులకు వినోదాల విందు వడ్డించబోతున్నారు. తనదైన విలక్షణమైన టైమింగ్ తో, రఫ్ అండ్ టఫ్ క్యారెక్టరైజేషన్ తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఆ సినిమానే ‘సారొచ్చారు’. ‘మంచి ప్రేమకథతో’ అనేది ఉపశీర్షిక. కాజల్, రిచా గంగోపాధ్యాయ కథానాయికలుగా నటించిన చిత్రమిది. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రానికి పరశురామ్ (బుజ్జి) దర్శకత్వం వహించారు. ఈ నెల 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. “సారొచ్చారు” చిత్ర విశేషాలను ఒక్కసారి పరిశీలిస్తే :
* కొంతకాలంగా రవితేజకు సరైన విజయాల్లేవు. ఆయన గత సినిమాలు బాక్సాఫీసు దగ్గర దారుణంగా బోల్తా పడ్డాయి. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే తపనతో ఈ సినిమా చేశారు. పైగా దర్శకుడు పరశురామ్ మంచి ఫామ్ లో ఉన్నారు. ‘సోలో’ సినిమా తరవాత ఆయన మెగాఫోన్ పట్టిన చిత్రమిదే.

* పరశురామ్ తో రవితేజకు ఇది రెండో సినిమా. ‘ఆంజనేయులు’ సినిమాతో వీరిద్దరూ ప్రేక్షకులకు వినోదం పంచారు. ఆ మ్యాజిక్ రెండో సినిమాలోనూ కొనసాగితే హిట్ ఖాయం. పైగా ఇందులో ఓ ప్రేమకథ కూడా మేళవించారు. ఇద్దరమ్మాయిలతో సార్ ఏం చేశారనేది ఆసక్తికరం అని దర్శకుడు చెబుతున్నారు.

* దర్శకుడికి వినోదాత్మక సన్నివేశాలు తెరకెక్కించడంలో మంచి ప్రావీణ్యం ఉంది. అలాంటి సన్నివేశాలు పడితే రవితేజ రెచ్చిపోతాడు. వీరిద్దరి సినిమా అంటే కాలక్షేపానికి ఢోకా లేనట్టే.

* అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ లో రూపుదిద్దుకొన్న చిత్రమిది. పక్కా ప్లానింగ్ తో సినిమాని ఎలా రూపొందించాలో నిర్మాత అశ్వనీదత్ కి బాగా తెలుసు. అందులోనూ ‘శక్తి’ షాక్ నుంచి కోలుకొని నిర్మిస్తున్న సినిమా ఇది. దత్తుకీ ఓ హిట్ కావాలి. కాబట్టి ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు.

* 2012 దేవిశ్రీ ప్రసాద్ దే. ‘గబ్బర్ సింగ్’ తో కేక పుట్టించిన దేవి ’జులాయి’తో అదరగొట్టారు. ఆయన సంగీతం అందించిన ‘సారొచ్చారు’ పాటలూ మాస్ ని ఆకట్టుకొంటున్నాయి. దేవి మ్యూజిక్ వర్కవుట్ అయితే… ’సారొచ్చారు’ గట్టెక్కినట్టే.

* కాజల్, రిచాగంగోపాధ్యాయలతో రవితేజ రెండో సినిమా ఇది. కాజల్ తో ‘వీర’లో నటించారు. ‘మిరపకాయ్’లో రిచాతో జత కట్టారు. వీరిద్దరి అందాలు ఈ సినిమాకు అదనపు ఆకర్షణ.

* అనేక అంచనాల మధ్య ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రవితేజ కొలతల ప్రకారం ఈ సినిమా ఉంటూ…కాస్త వైవిద్యంగా మలచగలిగితే కనీసం మినిమమ్ గ్యారెంటీగా మిగులుతుంది. అంతకు మించిన ఆకర్షణీయమైన అంశాలు జోడిస్తే… ’సారొచ్చారు’ హిట్ బాట పడుతుంది. ఈ ‘సార్….’ భవితవ్యం ఏమిటో తేల్చేది ప్రేక్షకులే.

Review coming soon…..