‘జాంబీ రెడ్డి’ వివాదం ఫై డైరెక్టర్ క్లారిటీ ..

‘అ!’ చిత్రంతోనే జాతీయ అవార్డు పొందిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ. ప్రస్తుతం ఆయన త‌న మూడో సినిమా లో బిజీగా ఉన్నారు. తొలి రెండు చిత్రాలు ‘అ!’, ‘క‌ల్కి’ల‌తో ఇటు ప్రేక్ష‌కుల‌, అటు విమ‌ర్శ‌కుల మెప్పుపొందిన ఆయ‌న ఇప్పుడు నిజ జీవిత ఘ‌ట‌న‌లను ఆధారం చేసుకొని సినిమా తీస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి ‘జాంబీ రెడ్డి’ అనే విభిన్న త‌ర‌హా టైటిల్ ప్ర‌క‌టించారు. హాలీవుడ్‌లో త‌యారైన వెన్ను జ‌ల‌ద‌రింప‌జేసే యానిమేష‌న్‌తో త‌న‌దైన స్టైల్‌తో ప్ర‌శాంత్‌వ‌ర్మ ఆ టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. తెలుగులో ఇది మొట్ట‌మొద‌టి జాంబీ ఫిల్మ్ కావ‌డం విశేషం.

ఆపిల్‌ ట్రీ స్టూడియోస్‌ నిర్మిస్తోన్న ఈ మూవీ టైటిల్‌ టీజర్‌ని కూడా ఇటీవల విడుదలైంది. అయితే ఈ మూవీ టైటిల్‌పై వివాదం మొదలైంది. ఓ వర్గం వారు ఈ టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్ వర్మ.

”ఏ వర్గాన్ని కించపరచాలన్న ఉద్దేశ్యం మాకు లేదు. కర్నూల్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఓ మహమ్మారిపై ఈ సినిమాను తెరకెక్కస్తున్నాం. అక్కడి ప్రజలు ఈ మహమ్మారిపై ఎలా విజయం సాధించారు అన్న కథనంలో ఈ మూవీ ఉండబోతోంది. హాలీవుడ్‌ సినిమాల్లో న్యూయార్క్‌ బ్యాక్‌డ్రాప్‌ను ఎలా తీసుకుంటారో, నేను కర్నూల్‌ని తీసుకున్నా. టైటిల్‌ని చూసి అపార్థం చేసుకోకండి. ఇందులో ఏ వర్గాన్ని మేము కించపరచవు. నా మొదటి చిత్రం అ! జాతీయంగా గుర్తింపును సాధించింది. జాంబీ రెడ్డి కూడా అలానే గుర్తింపు సాధిస్తుందని నమ్ముతున్నా” అని క్లారిటీ ఇచ్చారు.