పాతబస్తీ అల్లర్లకు కిరణే కారణం – ఓవైసీ

చార్మినార్-భాగ్యలక్ష్మీ ఆలయ వివాదం ఎన్నో మలుపులకు కారణంవుతూ వస్తోంది. తాజాగా శుక్రవారం రోజు ప్రార్థనల అనంతరం చెలరేగిన అల్లర్లకూ ఈ అంశానికే ముడిపెట్టబడింది. ఇదే వివాదం సాకుగా అధికార కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి కిరణ్ తో దోస్తీకి కటీఫ్ చెప్పిన మజ్లీస్ పార్టీ (ఎంఐఎం) అధినేత, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ తాజాగా పాతబస్తీలో జరిగిన అల్లర్లకు పూర్తిగా ముఖ్యమంత్రే కారణమంటూ ఆరోపించారు. అసదుద్దీన్ శనివారం ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న పరిణామాలపై మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిదే పాతబస్తీలో చెలరేగుతున్న ఘర్షణలకు పూర్తి బాధ్యత అన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం వివాదంలో కిరణ్ కావాలనే డ్రామా ఆడుతున్నారని, పాతబస్తీ ప్రజలపై ప్రతాపం చూపించొద్దని హితవు పలికారు. అంతగా కిరణ్, కాంగ్రెస్ కోరుకుంటే తమ ఎంఐఎం పార్టీపై రాజకీయంగా కక్ష తీర్చుకొమ్మని సవాల్ విసిరారు. కిరణ్, కాంగ్రెస్ ప్రభుత్వం భాగ్యలక్ష్మీ ఆలయ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కారన్నారు.