నేడు పద్మావతీ అమ్మవారి చక్ర స్నానం

padmavathi ammavari chakrasnanamతిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో అలిమేలు మంగకు తిరుమల నుంచి శ్రీవారి సారె అందింది. ఆదివారం పుష్కరిణిలో జరిగే పంచమీతీర్థం(చక్రస్నానం) సందర్భంగా శ్రీవారి సారె అందించడం  ఆనవాయితీ. తిరుమలలో జియ్యర్ స్వాముల సమక్షంలో పట్టుచీర, పసుపు, కుంకుమ, బంగారు తిరువాభరణాలు, అన్నప్రసాదాలు తదితర ముత్తయిదువ సారెను ఆదివారం వేకువజామున శ్రీవారి ప్రతినిధిగా తిరుమల జేఈవో, ఏకాంగి, అర్చకులు, పరిచారకులు కాలిమార్గాన అలిపిరికి చేరుకున్నారు. అక్కడ వీరికి శ్రీపద్మావతి అమ్మవారి ప్రతినిధిగా తిరుపతి జేఈవో పి.వెంకట్రామిరెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అనంతరం శ్రీవారి సారె ఏనుగు అంబారిపై ఊరేగింపుగా బయలుదేరింది. అలిపిరి నుంచి కోదండరామాలయం, గోవిందరాజస్వామి ఆలయం మీదుగా తిరుచానూరు ముఖద్వారం వద్ద ఉన్న పసుపు మండపానికి చేరగా, అక్కడ సారెకు పూజలు నిర్వహించి తిరువీధులలో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకు వచ్చారు. అక్కడి నుంచి పంచమితీర్థం మండపానికి తీసుకువచ్చి, సారెలోని పసుపు తదితర వాటితో అమ్మవారు, చక్రతాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. అనంతరం 11.45నుంచి మధ్యాహ్నం 12గంటలలోపు కుంభలగ్నంలో పద్మసరోవరంలో చక్రస్నానం నిర్వహించనున్నారు.