స్వరాష్ట్రం కేరళ.. సినీ ప్రవేశం ఆంధ్రప్రదేశ్లో… పాపులారిటీ తమిళనాట…. ప్రస్థుతం బాలీవుడ్… అవును ఇదీ “అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి”తో పరిచయమయిన కేరళ కుట్టి అసిన్ సినీప్రయాణం. తమిళంలో మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన “గజినీ” చిత్రంలో సూర్య సరసన ఓ ముఖ్యపాత్రలో మెరిసింది అసిన్. ఆ చిత్ర భారీ విజయం అసిన్ కు బాలీవుడ్ లో అవకాశాల తలుపులు తెరిచింది. గజినీ హిందీ రీమేక్ లో తొలిచిత్రంతోనే బాలీవుడ్ అగ్రనటుడు అమీర్ ఖాన్ సరసన నటించే లక్కీఛాన్స్ కొట్టేసింది. అటుపై కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన రెండు చిత్రాల్లో నటించేసింది. అయితే అసలు చిక్కల్లా ఇక్కడే వచ్చిపడింది. అసలే సల్మాన్ కు బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరుంది. దీనికితోడు తనతో సినిమాలో నటిస్తే చాలు ఆ హీరోయిన్ కు సల్మాన్ తో లింకు పెట్టేస్తాయి బాలీవుడ్ మీడియా వర్గాలు. అదేలా అసిన్ తో సల్మాన్ అఫైర్ నడిపిస్తున్నాడని, అందుకే వరుసగా ఆఫర్లిప్పిస్తున్నాడంటూ గాసిప్స్ పుట్టుకొచ్చాయి. దీనిపై అసిన్ స్పందిస్తూ.. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, అలాగే తన పెళ్ళి గురించి వస్తున్న వార్తలన్నీ కూడా ఉత్తివేనంటూ కొట్టిపారేసింది. తానెవరితోనూ ప్రేమలో పడలేదని, అలాగే ముఖ్యంగా సినీరంగానికి చెందిన వారితో తాను ప్రేమలో అస్సలు పడననీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను పెళ్ళి గురించి ఆలోచించడం లేదని, తన బాలీవుడ్ కెరియర్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని చెప్పింది అసిన్. తాను చేసిన సినిమాలు వందకోట్ల క్లబ్ లో ఉండడం తను ఎంతో గర్వపడే విషయమనీ.. తాజాగా తను చేస్తున్న చిత్రం “ఖిలాడీ 786” కూడా ఈ జాబితాలో ఉంటుందనీ ఆశా భావం వ్యక్తం చేసిన అసిన్ తాను తప్పకుండా చిత్రరంగంతో సంబంధం లేని వ్యక్తినే పెళ్ళి చేసుకుంటానని తేల్చిపారేసింది.