రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డి ఎల్ రవీంద్రారెడ్డి మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు ఇవ్వటమే కాక, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ సిఫారసు మేరకు రవీంద్రారెడ్డి ని బర్తరఫ్ చేసారు. ఆదినుంచీ రవీంద్రారెడ్డి కిరణ్ కు వ్యతిరేకంగా తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తూనే వున్నారు. ముఖ్యమంత్రి ఇటివల కాలంలో ప్రకటించిన పలు పధకాల పట్ల డి ఎల్ తన నిరసనను వ్యక్తం చేసారు. ప్రత్యేకించి బంగారు తల్లి పధకం పట్ల డి ఎల్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తి చేసారు. తన శాఖకు చెందినా పధకాలను కూడా తనకు తెలియకుండా సి ఎం ప్రకటిస్తున్నారని ఆయన అప్పట్లో బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసారు. పధకాలను ప్రకటించి వాటిని అమలుచేయకపోతే నాయకులను వెంటపడి కొట్టండంటూ ప్రజలను సి ఎం పైకి ఉసిగొల్పారు. ఇందుకు మనస్తాపం చెందిన సి ఎం అధిష్టానం తో మాట్లాడి ఈ బర్తరఫ్ నిర్ణయాన్ని గైకోన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ వరసలో బర్తరఫ్ కు గురికాబోయే తరువాతి మంత్రి సి. రామచంద్రయ్య అని తెలుస్తోంది.