ఆయ‌న సినిమాల‌న్నీ ‘మ‌ణిర‌త్నాలే..’

ratnamక‌మ‌ర్షియల్ అంశాలేంటో ఆయ‌న‌కు తెలీదు. ఏ క‌థ‌ను ప‌ట్టుకొంటే, ఏ స్టార్‌ని పెట్టుకొంటే వ్యాపారం జ‌రుగుతుంది అనే లెక్కలూ ఆయ‌న‌కు అర్థం కావు. క‌థానాయిక‌ను ఏ యాంగిల్లో చూపిస్తే కాసులు రాల‌తాయి – అనే వ్యవ‌హారాలు ఇంకా ఎక్కలేదాయ‌న‌కు. అందుకే మ‌ణిర‌త్నం ఇంకా పొల్యూట్ కాలేదు. ఆయ‌న్నుంచి ఇంకా స్వచ్ఛమైన‌… మ‌ణిర‌త్నాల్లాంటి సినిమాలొస్తున్నాయ్‌. ద‌ర్శకుడంటే ఓ క‌థ చెప్పాలి అంటుంటారు. ఈయ‌న కొన్ని జ్ఞాప‌కాల‌ను గుండెతెర‌పై ఆవిష్కరిస్తూ ఉంటారు. ఓ స‌మ‌స్యని క‌థ‌గా చెప్తారు. తాను న‌మ్ముకొన్న‌, త‌న‌ని క‌ల‌చి వేసిన గాథ‌ల్ని అందంగా అద్భుతంగా ఆవిష్కరిస్తారు. నాయ‌కుడు, ఇద్దరు, గురు – ఓ నాయ‌కుడు ఎలా ఉండాలో చూపించారు. ప్రేమ క‌థ‌కు గీతాంజ‌లితో భాష్యం చెప్పారు. అమ్మను వెదుక్కొంటూ బ‌య‌లు దేరిన కూతురి మ‌నోవేద‌న అమృత‌లో చూపించారు. త‌న‌లోని దేశ‌భ‌క్తి తీవ్రత రోజా, బొంబాయి సినిమాల్లో ధార‌బోశారు. మ‌ణి సినిమా అంటే ఓ మార్క్‌… అంతే! ఓ స్లో పాయిజ‌న్‌. దానికి భార‌తీయ సినీ ప్రేమికులు అల‌వాటు ప‌డిపోయారు. ఆయ‌న సినిమాల్ని ఇంకా ఇంకా సీడీల్లో వేసుకొని ఆస్వాదిస్తూనే ఉన్నారు. అలాంటి ఓ గొప్ప ద‌ర్శకుడికి, భావి త‌రాల దార్శనికుడికీ తెలుగు మిర్చి జ‌న్మదిన శుభాకాంక్షలు తెలియ‌జేసుకొంటోంది.