లారెన్స్ హీరోగా దర్శకత్వం వహించిన‘కాంచన 2’ తమిళ్ తో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ సాధించింది. సరికొత్త కామెడీ హర్రర్ గా ప్రేక్షకులను మెప్పించి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రాన్ని ‘లక్ష్మీ బాంబ్’ పేరిట హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కూడా లారెన్స్ దర్శకత్వం వహిస్తుండగా అక్షయ్ కుమార్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ కి జోడిగా కియారా అద్వానీ నటిస్తుంది.
కరోనా కారణంగా షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. థియేటర్స్ మూత పడ్డాయి. ఈ పరిస్థితులలో సినిమా రంగం దాదాపుగా కుదేలైంది. దీంతో ఈ నష్టాల నుంచి.. ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలా అని ఫిలిం మేకర్లు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లు పుంజుకున్నాయి. భారీ సబ్ స్క్రైబర్ల సంఖ్యతో.. అంతకుమించిన భారీ వ్యూయర్ షిప్ తో ట్రేడ్ లో దూసుకుపోతున్న ప్రపంచ స్థాయి ఓటీటీలకి మంచి డిమాండ్ ఏర్పడింది.
ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్ చిత్రాన్ని కూడా ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పెండింగ్ ఉన్న షూటింగ్ పూర్తి చేసి OTT లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నట్లు బి టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి.