Site icon TeluguMirchi.com

ఒంటరివాడవుతున్న కోదండరాం …!

తెలంగాణా రాజకీయ జే.ఎ.సి. చైర్మన్ ప్రొఫెసర్‌ కోదండరామిరెడ్డి ఏకాకి అవుతున్నారా…? ఉద్యమ పధం నుంచి ఆయనను ఒక వ్యూహం ప్రకారం ఒంటరిని చేస్తున్నారా….? కే.సి.ఆర్. తో విభేదాలు పెంచుకున్నందువల్లనే కోదండరాంకు ఈ పరిస్థితి దాపురించిందా ….? ఈ ప్రశ్నలకు సమాధానాలు అవుననే విన్పిస్తున్నాయి. ఇటీవలి కాలంలో తెలంగాణా రాష్ట్ర సమితికి జే.ఎ.సి. కి మధ్య అంతరం పెరుగుతోందన్న వ్యాఖ్యలు ముమ్మరంగా వినిపిస్తున్న నేపధ్యంలో కోదండరాం ప్రస్తుతం ఎటూ పాలుపోని స్థితిలో ఊగిసలాడుతున్నట్టు తెలుస్తోంది. కే.సి.ఆర్. డిల్లీ లో ఉన్నప్పుడు తెరాస తో సంబంధం లేకుండా తాను ఏ కార్యక్రమాన్నయినా చేయగలనన్న విషయాన్ని స్పష్టపరచేందుకే కోదండరాం తెలంగాణా మార్చ్ పిలుపునిచ్చి ఆ కార్యక్రమాన్ని సమర్ధంగానే నిర్వహించగలిగారు. పాలమూరు ఉపఎన్నిక సమయం నుంచి తెరాస కు తెలంగాణా జే.ఎ.సి. కి మధ్య పొడసూపిన విభేదాలు అప్పటినుంచి కొనసాగుతూనే వున్నాయి. చంద్రశేఖర రావు, కోదండరాంలు అప్పటినుంచి వ్యక్తిగతంగా కలుసుకోవటమే జరగలేదు. కోదండరాం పట్ల తీవ్ర ఆగ్రహంగా వున్న చంద్రశేఖర రావు సమయం కోసం వేచిచూస్తున్నారు. ఏదయినా ఒక ఫంక్షన్ కు తనను ఎవరయినా పిలిచినపుడు కూడా, ఆ ఫంక్షన్ కు కోదండరాం వస్తున్నారని తెలిస్తే కె.సి.ఆర్. ఎగ్గొట్టిన సంఘటనలు కూడా వున్నాయి. తాను వచ్చి వ్యక్తిగతంగా కలుస్తానని ఎన్నిసార్లు కోదండరాం కబురు పెడుతున్నా చంద్రశేఖర రావు చాలా వ్యూహాత్మకంగా దానిని అవాయిడ్ చేసినట్లు కూడా సమాచారం.

కోదండరాం కు అత్యంత సన్నిహితులుగా మెలుగుతున్న కొందరు నాయకులను కూడా కే.సి.ఆర్. తన దగ్గరకు పిలిపించుకుని తన వైపు తిప్పుకున్నట్టు జే.ఎ.సి. వర్గాల కథనం. ఈ విధంగా కోదండరాం కు తెలియకుండా ఆయన చాప కిందికి నీరు తేవటంలో కే.సి.ఆర్. సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇది చాలదన్నట్టు ఇటివల రాష్ట్రమంత్రి గీతారెడ్డి కి వ్యతిరేకంగా కోదండరాం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆయనపై  ఎస్సి. ఎస్టి . అట్రాసిటి కేసు నమోదయింది. రాష్ట్ర వ్యాప్తంగా గీతా రెడ్డి కి చెందిన సామాజిక వర్గం రెచ్చిపోయింది. మంత్రి కూడా ఆగ్రహంతో ఊగిపోయింది. అమీ తుమీ తేల్చుకోవాలనుకుంది. ఈ పరిణామం తో కంగారుపడిన కోదండరాం తానసలు ఆ వ్యాఖ్యలు చేయలేదని బుకాయించి ఆ తరువాత ” తప్పు చేసాను…క్షమించండి…ఇంకెప్పుడూ ఇలా జరగదు…ఈ సారికి వదిలేయండి…” అని ప్రాధేయపడే స్థితికి చేరుకున్నారు. ఈ దశలో కోదండరాం కు నైతికంగా ఇటు జే.ఎ.సి. నుంచి గానీ , తెరాస నుంచి గానీ ఎటువంటి మద్దతు లభించలేదు… ఇదే సమయంలో తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణా ఉద్యోగ సంఘాల నాయకుడు స్వామిగౌడ్ తెరాస తీర్ధం పుచ్చుకుని కే.సి.ఆర్. కు జై కొట్టారు. దీంతో కోదండరాం ను మరింత ఒంటరితనం ఆవహించింది. శుక్రవారం నాడు కె.సి.ఆర్. ను కలువనున్న కోదండరాం కు ఎటువంటి స్వాగతం లభిస్తుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు.  క్రమేపి అందరూ దూరమవుతుండటంతో ఒంటరిగా మిగిలిపోయిన కోదండరాం తన ఉద్యమ భవితవ్యాన్ని, రాజకీయ భవితవ్యాన్ని ఎలా పునర్నిర్మించుకుంటారో చూడాల్సిందే…

Exit mobile version