విడదీస్తే చూస్తూ ఊరుకోం : కావూరి సాంబశివరావు

కాంగ్రెస్‌ ఎంపీ కావూరి సాంబశివరావు కేంద్ర నాయకత్వంపై మరోసారి తనదైన శైలిలో విరుచుపడ్డారు. అయితే.. ఇప్పుడు ఆయనకు సంబంధించిన విషయంపై కాకుండా అందరూ మాట్లాడుతున్న ప్రత్యేక తెలంగాణ అంశాన్ని సాకుగా తీసుకున్నారు. కేంద్రంలో వున్న అసమర్థ నాయకత్వం వల్లే ఇన్ని సమస్యలు తలెత్తాయని… కేంద్ర నాయకత్వానికి బుద్ధిలేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఇస్తారా? ఇవ్వరా? అనేది తక్షణమే తేల్చిపారేయ్యాలంటూ కావూరి డిమాండ్ చేశారు. అంతటితో ఊరుకోకుండా పనిలో పనిగా కేంద్రంలోని ప్రతిపక్షాలపై కూడా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక వ్యక్తి తన స్వార్థం కోసం రాష్ర్టాన్ని విభజించాలని డిమాండ్ చేస్తే అందుకు మీరెలా మద్దతు తెలుపుతున్నారంటూ కావూరి ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు.
అప్పట్లో మర్రి చెన్నారెడ్డి కూడా  తెలంగాణ అంశంపై ఫైట్ చేసి.. చివరికి ముఖ్యమంత్రి పీఠం దక్కిన తర్వాత ఏమిమాట్లాడకుండా వుండిపోయారు. అలాగే…ఒక ఓటు రెండు రాష్ర్టాలంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ కూడా తెలంగాణ ఇవ్వడం కుదరదంటూ చేతులెత్తేసిందని కావూరి ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ర్టాన్ని ఎట్టిపరిస్థితులోనూ సమైక్యంగా వుంచాల్సిందేనని.. విడదీస్తే ఊరుకునేది లేదంటూ ఆయన డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీచేశారు.