Site icon TeluguMirchi.com

జగన్ నిర్దోషి అని చెప్పగలరా? : లోకేష్

తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో క్రమక్రమంగా పాలుపంచుకుంటున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు లోకేష్….తన ట్విట్టర్ లో ప్రత్యర్థి పార్టీలపై వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు. జగన్ అవినీతి విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో కొత్తగా చెప్పాలని ఆయన పార్టీకి సూచించారు. వంద నోట్ల బస్తాలను వెయ్యి లారీల నిండా నింపితే ఎంత మొత్తమో జగన్ అంత మొత్తాన్ని అక్రమంగా సంపాదించారని చెప్తే సామాన్య జనానికి అర్థమయ్యేలా, వాళ్ల ఊహాలకు అందే విధంగా ఉంటుందని లోకేష్ పార్టీ నాయకులకు సూచించిన తర్వాత అదే తరహాలో పార్టీ నేతలు జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా విదేశీ పెట్టుబడులు రావాలంటూ హెరిటేజ్ కోరుకుంటుందంటూ వైకాపా నేతలు చేసిన విమర్శను ఖండిస్తూ..ప్రాథమిక సమాచారంతో మాట్లాడితే బాగుంటుందని లోకేష్ ట్వీట్ చేశారు. రాష్ర్టపతి ఎన్నికల్లో ప్రణబ్ కు ఓటేసిన జగన్…ఎఫ్ డీఐల విషయంలో ఓటింగ్ లో ఎందుకు పాల్గొనలేదని నిలదీశారు. దీనికి సమాధానం చెప్పకుండా తెదేపాను విమర్శించడం ఒక పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. “జగన్ కు బెయిల్ వస్తుందని పదే పదే చెప్తున్న వైకాపా…అతను నిర్దోషిగా బయటకు వస్తారని ఎందుకు చెప్పలేకపోతోంది? ” అంటూ ట్వీట్టర్ లో ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా మరో ట్వీట్ లో…” వైకాపా తన సర్వేలో, వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పుకుంటున్నప్పుడు ఇక ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన పనేముంది? వాళ్లు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఎక్కువ డబ్బులిచ్చారా? దొంగ సర్వేలకు ఎక్కువ ఖర్చు చేశారా? అని వ్యంగ్యోక్తులు విసిరారు. కేసీఆర్ పైనా చిన బాబు ట్వీట్ చేశారు “ నాన్న పాదయాత్ర 700 కిలోమీటర్లు పూర్తయ్యాక కేసీఆర్ హఠాత్తుగా నిద్రలేచి..విద్యుత్ కోతలకు చంద్రబాబే కారణం అంటున్నారు. రేపు నిద్రలేచాక ఆ వ్యాఖ్యలకు చింతిస్తారులే” అని పేర్కొన్నారు. ఈ విధంగా లోకోష్ బాబు పార్టీ నాయకులకు…జగన్ అవినీతి గురించి ప్రజలకు కొత్తగా, వైవిధ్యంగా చెప్పాలని సూచించడమే కాకుండా ఆచరణలో కూడా పాటించి చూపించారని రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు.

 

Exit mobile version