జగన్ 2వ బెయిల్ పిటిషన్ తిరస్కరణ

అక్రమాస్తుల కేసులో నిందితునిగా ఉన్న జగన్ పెట్టుకున్న రెండవ బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. తనకు బెయిల్ కావాలంటూ పట్టువదలని విక్రమార్కునిలా ప్రయత్నిస్తూనే ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టులో మరోసారి ఎదురు దెబ్బతగిలింది. జగన్ కు బెయిల్ ఇవ్వరాదంటూ సీబీఐ చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది. జగన్ బెయిల్ అడగడానికి ప్రస్తుత దశలో వీలులేదని తేల్చి చెప్పింది. సుప్రీం కోర్టు సీబీఐ దర్యాప్తునకు కాలపరిమితి విధించలేదని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగం ప్రకారం సుప్రీం కోర్టు తీర్పుకు దేశంలోని ఏ న్యాయస్థానమైనా కట్టుబడి ఉండాల్సిందేనని తీర్పులో పేర్కొంది. దీంతో రెండవ బెయిల్ పిటిషన్ కూడా కొట్టివేతకు గురైంది.

గతంలోనే జగన్ పెట్టుకున్న స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ను కూడా ఇదే కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో నిందితుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిమాండ్ గడువు రేపటితోముగియనుంది. సీబీఐ కోర్టు విధించిన రిమాండ్ ముగియనుండటంతో పోలీసులు రేపు జగన్ ను కోర్టుకు హాజరుపరచనున్నట్లు సమాచారం.