వై ఎస్ ఆర్ పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుతం చంచల్ గూడా జైలులో వున్న జగన్మోహనరెడ్డికి రాష్ట్రంలో అధికారం లో వున్న కాంగ్రెస్ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా అన్ని సౌకర్యాలను కల్పిస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆదివారం నాడు జరిగిన విలేకరుల సమావేశంలో ఆరోపించారు. జైలును తన పార్టీ కేంద్ర కార్యాలయంగా జగన్ మార్చుకున్నారని, సెల్ ఫోన్, ల్యాప్ టాప్ లాంటివి వాడుకుంటూ తన కార్యకలాపాలకు జైలును అడ్డాగా మార్చుకున్నారని, ములాఖత్ ల పేరిట నిత్యం పార్టీనాయకులను కలుసుకుంటూ పార్టీ ప్రోగ్రాములు డిజైన్ చేసుకుంటున్నారని, ఈ విషయమై తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రాష్ట్రప్రభుత్వంగాని, జైలు అధికారులు గానీ పట్టించుకోవటం లేదని ఆయన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఐదురోజులపాటు గుంటూరు లో దీక్ష చేసిన వై ఎస్ విజయమ్మ తన కొడుకు తనను దీక్ష విరమించమని చెప్పాడని, అందుకే ఈ పూట తాను దీక్ష విరమిస్తున్నానని చెప్పటం దారుణమని గాలి అన్నారు. జగన్ జైలులో సెల్ ఫోన్ వాడుతున్నారనేందుకు ఇదే నిదర్శనమని ముద్దుకృష్ణమ పేర్కొన్నారు. కాంగ్రెస్, టి ఆర్ ఎస్ , వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నాయని ఆయన అన్నారు.