ఎన్డీయే నుంచి జేడీయూ అవుట్..?

Nitish-Kumarప్రధాని అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని.. మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న ఎన్డీయే భాగస్వామ్య పక్షం జేడీయూ అన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా, ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ వైదొలగనున్నట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంకేతాలిచ్చారు. అయితే ఈ నెల 15న ఈ అంశంపై ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్డీయే నుంచి వైదొలగడం వల్ల తలెత్తే పరిణామాలపై జేడీయూ విశ్లేషించుకుంటున్నారని తెలుస్తోంది. మరోవైపు బీహార్‌ లో నితీష్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఇస్తుంది. ఈ నేపథ్యంలో.. ఎన్డీయే కు గుడ్ బై చెబితే.. ప్రభుత్వం మైనార్టీలో పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ స్వతంత్ర ఎమ్మెల్యేలతో కూడా సంప్రదిస్తున్నట్లు సమాచారం.

అయితే, జేడీయూ ఇప్పటికిప్పుడే ఎన్డీయే నుంచి వైదొలగాల్సిన అవసరం ఏముందంటే… మోడీకి బీజేపీ ప్రచార కమీటి బాధ్యతలు అప్పగించడమేనని తెలుస్తోంది. భాజపా అగ్రనేత అద్వానీ మోడీ బాధ్యతల పట్ల కినుకు వహించి రాజీనామా అస్త్రం విసిరినప్పటికీని.. మోడీ బాధ్యతలను భాజపా తగ్గించే ప్రయత్నం చేయలేదు. భాజపా ప్రస్తుతానికి మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించనప్పటికీని.. ప్రచార బాధ్యతలను అప్పగించడం ద్వారా ఎన్డీయే
కూటమిలో ఆయన బాధ్యతలను పెంచిందనే చెప్పాలి. ప్రచార బాధ్యతలు అప్పగింత అప్పుడే అగ్రనేత అద్వానీ మాటలను పెడచెవిన పెట్టిన భాజపా.. భవిష్యత్ లో ప్రధాని అభ్యర్థిగా మోడీని జేడీయూ వ్యతిరేకించినా..ఫలితం ఉండదనే ఉద్దేశంతోనే నితీష్ ఈ తాజా సంకేతాలను ఇచ్చారని సమాచారం.