కేరళలోని మలప్పురంలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ గా మారింది. పైశాచిక గుణంతో కొందరు వ్యక్తులు ఊళ్ళో నుంచి వెళ్తున్న ఆడ ఏనుగుకు టపాసులతో నింపిన పైనాపిల్ తినిపించారు. ఆశగా ఆ పండు తిన్న ఏనుగు నోటిలోనే పేలుడు సంభవించడంతో నోటి నిండా, తొండానికి గాయాలై విలవిలలాడిపోతూ ప్రాణాలు విడిచింది. పైగా ఆ ఏనుగు గర్భంతో ఉండటంతో ఈ ఘటన అందరి హృదయాలను కలచివేసింది. ఈ ఘటన పట్ల అంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ..నిందితులకు కఠిన శిక్ష వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటన పట్ల పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ అట్టి దుర్మార్గపు చర్యకు పాల్పడిన వారిపై విరుచుకు పడుతున్నారు. ఇప్పటికే అనుష్క శర్మ, శ్రధ్ధా కపూర్, రణ దీప్ హుడా, దిశా పటానీ, అలియా భట్ వంటివారు ఈ చర్యను ఖండిస్తూ ట్వీట్స్ చేయగా.. తాజాగా యాంకర్, సినీ నటి అనసూయ తనదైన కోణంలో రియాక్ట్ అయింది.
”ఇలాంటి ఘటనలు చూస్తుంటే ఖచ్చితంగా మానమంతా అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నామనిపిస్తోంది. మానవజాతి అనేదే ఒక చెత్త రకం. అడవి దైవంతో సమానం. నాగరికత దెయ్యాల కుంపటిగా తయారైంది. నిజంగా ఈ ఘటన తీవ్ర మనో వేదనను కలిగిస్తోంది” అంటూ అనసూయ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.