ఈవీవీ.. ఆ న‌వ్వులేవీ?

evv

న‌వ్వించ‌డం ఓ భోగం – అని గురువు జంథ్యాల మాట‌ల్ని అక్షరాలా పాటించిన శిష్యుడు ఈవీవీ స‌త్యనారాయ‌ణ‌. చెవిలో పువ్వు నుంచి కత్తి కాంతారావు వ‌ర‌కూ ఆయ‌న‌ని చిరున‌వ్వుల ప్రయాణ‌మే. త‌న సినిమాల‌తో కిత‌కిత‌లు పెట్టి – త‌న నిష్ర్కమ‌ణ‌తో క‌న్నీళ్లు మిగిల్చారాయ‌న‌. ఇప్పుడు ఈవీవీ లేక‌పోయినా ఆయ‌న మిగిల్చిన న‌వ్వులు మాత్రం మ‌న మ‌ధ్యే ఉన్నాయి.. ఆయ‌న సినిమాల రూపంలో.

అప్పుల అప్పారావు, ఆ ఒక్కటీ అడ‌క్కు, వార‌సుడు, హ‌లో బ్రద‌ర్‌, ఆమె, చాలాబాగుంది, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు… ఇలా ఆయ‌న కెరీర్‌లో 20 విజ‌య‌వంత‌మైన చిత్రాలున్నాయి. ఆమె, అమ్మో ఒక‌టో తారీఖు లాంటి సినిమాలూ తీశారు. క‌థ ఎలాంటిదైనా, ఇతివృత్తం ఏదైనా… ఆయ‌న న‌మ్ముకొన్నది వినోదాన్నే. బాలీవుడ్‌లో అడుగుపెట్టి త‌న అభిమాన క‌థానాయ‌కుడు అమితాబ్‌బచ్చన్ ని డైరెక్ట్ చేశారు. వ‌రుస ఫ్లాప్‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నప్పుడు నిర్మాత‌గా మారారు. సొంత బ్యాన‌ర్‌పై విజ‌య‌వంత‌మైన చిత్రాలు తీసి – మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చారు. బురిడీతో 50 సినిమాల మైలు రాయిని అందుకొని – నూరు చిత్రాల‌వైపు సాగేలోగా నూరేళ్లూ నిండిపోయాయి. స్వచ్ఛమైన వినోదానికి చిరునామాగా నిలిచిన ఈవీవీ మ‌న మ‌ధ్య లేక‌పోవ‌డం తీర‌ని లోటు. ఈ రోజు ఆయ‌న పుట్టిన రోజు. ఈవీవీ విడ‌చిన గ‌త జ్ఞాప‌కాల‌ని స్మరించుకొంటూ గ‌డిపేద్దాం. సిస‌లైన న‌వ్వుల సినిమాలొచ్చిన రోజే – ఆయ‌న‌కు నిజ‌మైన నివాళి.