అలకవీడిన అద్వానీ..!

advani-resignationభాజపా అగ్రనేత అద్వానీ రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్ చెప్పారు. బీజేపీ లో భీష్ముని లాంటి అద్వానీ రాజనామాతో.. ఒక్కసారిగా భారతీయ జనతాపార్టీ, ఎన్డీయే లో సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, అగ్రనేత అద్వానీతో పార్టీ సీనియర్ నేతలు పలుమార్లు సమావేశం అయిన అనంతరం అద్వానీని శాంతింపజేయడంలో సఫలీకృతం అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. సాయంత్రం పార్టీ అధ్యక్షుడు అద్వానీతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్ ఎస్ ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ సూచన మేరకే అద్వానీ రాజీనామా వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అద్వానీ చెప్పారని ఆయన వెల్లడించారు. బీజేపీకి మార్గ నిర్దేశం చేసే పెద్ద దిక్కు అద్వానీ అని,  పార్టీ పట్ల  ఆయనకున్న ఉన్న అభ్యంతరాలను వెంటనే పరిశీలిస్తామని రాజ్ నాథ్ స్పష్టం చేశారు. మరోవైపు అద్వానీ నిర్ణయం పట్ల గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ద్వారా  హర్షం వ్యక్తం చేశారు.