Site icon TeluguMirchi.com

మెగాస్టార్ మానవత్వం…!

ఎంత ఎత్తు ఎదిగినా… మూలాలను మరచిపోకూడదు. కన్న తల్లినీ, పుట్టిన ఊరునీ… ఎదగడానికి సహకరించిన వ్యవస్థనీ గుర్తుపెట్టుకోవాలి. అదెలాగో చిరంజీవిని చూసి నేర్చుకోవాలి. సినీ రంగాన్ని వదిలి రాజకీయాల్లోకి వెళ్ళినా… నేడు కేంద్ర మంత్రిగా వున్నత పదవిని అలంకరించినా… 24 గంటలూ రాజకీయ ఒత్తిళ్లలో తలమునకలుగా వున్నా.. సినిమా రంగాన్ని, ఇక్కడి వ్యక్తులనూ ఆయన మర్చిపోలేదు. తోటి కళా కారుడికి చేయూత అందించడానికి చిరు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారని చెప్పడానికి మరో ఉదంతం నిదర్శనంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే…

మిమిక్రీ కళాకారుడిగా దేశ విదేశాల్లో వేలాది ప్రదర్శనలు ఇచ్చారు… హరికిషన్. అనుకరణ విద్యలో నేరెళ్ల వేణుమాధవ్ తరవాత అంతటి పేరు తెచ్చుకున్న కళాకారుడాయన. గత కొంతకాలంగా కిషన్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. కిడ్నీ చెడిపోవడంతో… నాలుగు జోకులూ ఆరు నవ్వులతో హాయిగా సాగిపోతున్న ఆయన జీవితం అనుకోని కుదుపుకి గురయ్యింది. భార్య ఓ కిడ్నీ ఇచ్చి.. అర్ధాంగి గా తన ధర్మం నిర్వర్తించినా దేవుడు కనికరించలేదు. ఆ కిడ్నీ కుడా పాడైపోయింది. ఇప్పుడు ఆయన డయాలసీస్ చేయించుకుంటూ… కాలం వెళ్ళదీస్తున్నారు . అయినా క్రుంగిపోలేదు. ఇప్పటికీ అదే హుషారుతో… మైకు అందుకుని నవ్వులు పంచుతున్నారు. డయాలసీస్ అంటే మాటలా… రూపాయలకు రెక్కలొచ్చి ఎగిరిపోతున్నాయి. హరికిషన్ పరిస్థితి తెలుసుకున్న చిరంజీవి స్పందించారు. “నీకు ఎలాంటి సహకారం కావాలన్నా నేనున్నా” అని భరోసా ఇచ్చారు. అప్పటికీ సహాయం పొందడానికి హరికిషన్ సిద్ధంగా లేరని గమనించి… హరికిషన్ ఇంటికి ఓ కవర్ పంపించారు. తెరచి చూస్తె… అక్షరాలా లక్ష రూపాయలున్నాయి. అడగకుండానే… సహాయం అందించిన ఆపద్భాంధ వుడి ని చూసి హరికిషన్ దంపతుల నోట మాట రాలేదు. “భవిషత్తులో ఎలాంటి సహాయం కావాలన్నా…. మొహమాట పడొద్దు” అని మరోసారి చేయూత నిచ్చారు. చిరంజీవి ఉదార స్వభావం ఎంతో మందికి ఆదర్శం కావాలి. అందరి దీవెనలతో హరికిషన్ త్వరగా కోలుకోవాలని, ఎప్పటిలాగే నవ్వులు పంచాలని కోరుకుందాం. గెట్ వెల్ సూన్ హరి కిషన్….

Exit mobile version