చంద్రబాబు చేసిన తెలివైన పని

ntrతన బావమరది, స్వర్గీయ ఎన్.టి.ఆర్. తనయుడు, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ ను మహానాడు కు ఆహ్వానించటం ద్వారా తెలుగుదేశం పార్టి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలివిగా ప్రవర్తించారనే చెప్పాలి. గత కొంతకాలంగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్న ఈ రెండు కుటుంబాల మధ్య అంతరం కొనసాగుతూనే వుంది. చంద్రబాబు వైఖరి పట్ల కోపంగా వున్న హరికృష్ణ ఇటివలి కాలంలో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అనంతపురం జిల్లాలో తనే దగ్గరుండి పాదయాత్ర ను ప్రారంభించిన హరికృష్ణ విశాఖ లో జరిగిన పాదయాత్ర ముగింపు సభకు హాజరు కాలేదు. ఆయనతో బాటు హీరో జూనియర్ ఎన్. టి. ఆర్. కూడా ఈ సభకు డుమ్మా కొట్టారు. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య వైరుధ్యాలు బహిరంగమయ్యాయి. కాగా విశాఖ సభకు చంద్రబాబు హరికృష్ణను గానీ, జూనియర్ ను గానీ పిలవలేదన్న మాటలూ వినిపించాయి. పిలిచివుంటే వచ్చి ఉండేవారేమోనన్న వ్యాఖ్యలు కూడా వినిపించాయి.

వాస్తవానికి హరికృష్ణను ఎవరూ పిలవనక్కరలేదు. ఆయన రాజ్యసభ సభ్యుడు మాత్రమే కాక పాలిట్ బ్యూరో సభ్యుడు కూడా. ఇలాంటి కార్యక్రమాలకు హాజరుకావటం ఆయన బాధ్యత. ఇదిలావుండగా ఒకవేళ హరికృష్ణ, జూనియర్ లు దూరంగా వున్నా చంద్రబాబే ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి ఏమైనా విభేదాలు సర్దుబాటు చేసుకోవచ్చు కదా అని క్యాడర్ కూడా భావించింది. అది ఒక విధంగా పార్టీ కి ఈ దశలో మంచిది కదా అని కూడా సలహాలు, సూచనలు వినిపించాయి. ఈ నేపధ్యంలో శనివారం నాడు చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” ఈ నెలాఖరుకు జరుగనున్న మహానాడు లో హరికృష్ణ, జూనియర్ ఎన్. టి. ఆర్. లు ఈ మహానాడు లో తప్పక పాల్గొనాలి. పార్టీలో కీలకమైన వ్యక్తిగా హరికృష్ణ పై చాలా బాధ్యతలున్నాయి. వాళ్ళు తప్పక పాల్గొంటారని అనుకుంటున్నాను”అన్నారు. ఈ ప్రకటనతో చంద్రబాబు వైపునుండి తెర తొలగినట్లయింది.

ఇక మహానాడు లో పాల్గొనటం విషయంలో తండ్రీ కొడుకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే మహానాడు కు మున్డురోజున 26 వ తేదీనే జూనియర్ షూటింగ్ పేరుతో మలేషియా వెళుతున్నట్టు తెలిసింది. ఇదే జరిగి ఎన్.టి.ఆర్. మహానాడు కు డుమ్మా కొడితే అందరూ ఆయనను అనుమానించే అవకాశం వుంది. కావాలనే మహానాడు కు హాజరు కావటం ఇష్టం లేకనే పరాయి దేశానికి షూటింగ్ వంకతో ఆయన వెళ్లారనే అపప్రధను ఎన్టిఆర్ మోయాల్సివస్తుంది.