తెలుగు “దేశాన్ని” దెబ్బతీసేందుకు కేంద్రం కుట్ర : చంద్రబాబు

NCBNకేంద్రం తెలంగాణపై తన వైఖరిని స్పష్టం చేయకుండా తెలుగుదేశాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతోందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. తెలంగాణ సమస్యను పరిష్కరించే బాధ్యత అధికారపార్టీపై ఉందన్నది అందరూ గమనించాలని అన్నారు. చంద్రబాబు పాదయాత్ర నిజామాబాద్ జిల్లాలో 8వ రోజు సాటపూర్లో గంట ఆలస్యంగా ప్రారంభమైంది. అంతకు ముందు బాబు నిజామాబాద్ రూరల్, జుక్కల్, ఆర్మూర్ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు. సాటాపూర్ లో ప్రారంభమైన బాబు పాదయాత్ర బోర్గాం, తాడ్ బొలోలి మీదుగా సాగింది. పాదయాత్రలో దారిపొడువునా రైతులతో, గ్రామస్తులతో మాట్లాడుతూ ఆయన ముందుకు సాగారు. చిన్న చిన్న మేళ్లతో ప్రజలకు మభ్యపెట్టిన వైఎస్ తన కుమారుడు జగన్ కు మాత్రం కోట్ల రూపాయలు దోచిపెట్టారని చంద్రబాబు ఆరోపించారు.

తాడ్ బిలోలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. తెదేపా అధికారంలోకి వచ్చాక రైతులు తీసుకున్న అప్పులన్నీ మాఫీ చేస్తామని, ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆయా వర్గాలన్నింటికి న్యాయం జరిగేలా చూస్తామనీ, మాదిగ రిజర్వేషన్ల వల్ల మాలలకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తామని బాబు హామి ఇచ్చారు. రిజర్వేషన్లు అడ్డుకుని వైఎస్ మాదిగల పొట్టకొట్టారని విమర్శించారు. పోలింగ్ నాడు తనని గుర్తు పెట్టుకుంటే ఐదేళ్లపాటు సేవకునిలా పనిచేస్తానంటూ చంద్రబాబు ప్రజలకు విన్నవించుకుంటున్నారు. తాడ్ బిలోలి ఎస్సీ కాలనీలో చంద్రబాబు సహపంక్తి భోజనం చేశారు.