‘దేనికైనా రెడీ’ టీంపై మరో కేసు

‘దేనికైనా రెడీ’ చిత్రం రిలీజయిన రోజు నుంచి వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా మరోసారి కోర్టు కేసుల్లో ఇరుక్కుంది. చిత్రం నటీనటులు, దర్శక, నిర్మాతలు, సెన్సార్ బోర్డు సభ్యులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. రాష్ర్టవ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలన్ని సినిమాలో తమను కించపరిచేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలని ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై హైదరాబాద్ కొత్తపేటకు చెందిన వ్యాపారవేత్త సి.రఘునాథరావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘దేనికైనా రెఢీ’ చిత్రంలో బ్రాహ్మణులను కించపరిచారని, కొన్ని సన్నివేశాలు వారి మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని కోర్టుకు విన్నవించారు. రఘునాథరావు దాఖలు చేసిన ఈ పిటిషన్ ను రంగారెడ్డి జిల్లా 13వ మెట్రోపాలిటన్ కోర్టు విచారణకు స్వీకరించి మంగళవారం విచారణ జరిపింది. అనంతరం సినిమా దర్శక నిర్మాతలు, నటీ నటులు, సెన్సార్ బోర్డు సభ్యులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో 120బి, 153ఎ, 295ఎ, 420 ఐపీసీ సెక్షన్ల కింద 17 మందిపై మంగళవారం చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేశారు.

కోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశించిన నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి : 

24 ఫ్రేమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత (ఎ1), మంచు మోహన్‌బాబు (ఎ2), దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డి (ఎ3), మంచు విష్ణువర్థన్ (ఎ4), కథానాయిక హన్సిక (ఎ5), క్యారెక్టర్ ఆర్టిస్టులు సురేఖావాణి (ఎ6), బ్రహ్మానందం (ఎ7), ధర్మవరపు సుబ్రహ్మణ్యం (ఎ8), ఏవీఎస్ (ఎ9), సెన్సార్ బోర్డు సభ్యులు పద్మజారెడ్డి (ఎ10), సునీతాచౌదరి (ఎ11), నాగులాపల్లి పద్మిని (ఎ12), రేవతి గౌడ్ (ఎ13), అనురాధా పద్మావతి (ఎ14), కోటిబాబు (ఎ15), కర్నాటి విద్యాసాగర్ (ఎ16), బీవీ సాయిసుబ్రహ్మణ్యం (ఎ17), సూర్యప్రకాశ్ (ఎ18), సెన్సార్ రివైజ్డ్ కమిటీ ప్రిసైడింగ్ అధికారి శేఖర్‌బాబు (ఎ19).