బొత్స ఇంటి పెళ్లి ఖర్చు రూ. 50 కోట్లు

పీసీసీ అధ్యక్షుడు, రావణ శాఖ మంత్రి అయిన  బొత్స సత్యనారాయణ తన కూతురు పెళ్లికి సుమారు రూ.50 కోట్లు ఖర్చు చేసినట్లుగా కథనాలు వచ్చాయన్న దానిపై విచారణ జరపించాలని కోరుతూ కాంగ్రెస్  సెక్యులర్ హిందూ ఫోరం… హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వేసింది. ఈ పిటిషన్ ను కాంగ్రెస్  సెక్యూలర్ హిందూ ఫోరం రాష్ట్ర కమిటీ కన్వీనర్ ఎల్.రవికుమార్ రెడ్డి దాఖలు చేశారు. ఆదాయ పన్ను శాఖ ముఖ్య కమిషనర్ తో  బొత్స వివాహంలో చేసిన భారీ ఖర్చులపై విచారణకు ఆదేశించాలని, ఈ వివాహానికి హాజరైన ప్రముఖుల వసతి, రవాణాకు ప్రభుత్వం వెచ్చించిన సొమ్ముపై నివేదిక సమర్పించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని పిల్ లో కోరారు. హోంశాఖ ముఖ్యకార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విజయనగరం, విశాఖపట్నం, జిల్లాల కలెక్టర్లు, ఆర్టీఏ, ఆదాయపన్ను శాఖ కమిషనర్ ను, మంత్రి బొత్స సత్యనారాయణలను, ప్రతివాదులుగా చేర్చారు. బొత్స కుమార్తె వివాహ వేడుకలో భారీగా అధికార దుర్వినియోగం జరిగిందని, సుమారు 50 కోట్లు ఖర్చు చేసినట్లు మీడియా కథనాలు వచ్చాయని ఆయన పిల్ లో ప్రస్తావించారు. విజయనగరం-విశాఖ రహదారిలో ట్రాఫిక్ స్తంభించిందనీ, కనీసం అంబులెన్స్ నూ తిరగనివ్వలేదని చెప్పారు. రాష్ర్టంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్ల అధిష్టానం చర్యలు తీసుకునే సాహసం చేయలేక పోతోందన్నారు. అందువల్ల తాను కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు