సంయమనం కోల్పోతున్న భారతి

ys bharathiస్థిత ప్రజ్ఞత సాధించడం మహామహులకే సాధ్యం కాదు. ఇక సామాన్యుల సంగతి ఎంత. అందునా భర్త ఏడాది కాలంగా జైలులో కూర్చున్నపుడు, దగ్గరున్న కోట్లు కొరగానివిగా మారినపుడు, ఏ విధంగానూ బయటపడే అవకాశాలు కన్పించనపుడు, ఏం చేయాలో తోచనపుడు, ఎన్ని వనరులున్నా, ఎంత మంది అండదండలున్నా, అన్నీ విఫలమైపోతున్నపుడు ఓ మనిషి ఎలా నిరాశ, నిస్పృహలకు లోనైపోతాడో, ఎలా సహనాన్ని కోల్పోతాడో, ఇప్పుడు వైఎస్ భారతిని చూస్తే అర్థమవుతుంది.

మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. తండ్రి వైద్యుడు. ఈ తలకాయనొప్పులేవీ తెలియని బతుకు. ఏడాది కితం వరకు ఏ వ్యాపారపు తలకాయనొప్పులు లేవు. ఇంట్లో ఇద్దరు ఆడపిల్లల ఆలనా పాలనా తప్ప మరో వ్యవహారం లేదు. కానీ ఒక్కసారి ఆకాశం కూలి కాళ్లపై పడింది. భర్త జైలుకు వెళ్లడంతో వ్యాపారాల బాధ్యతలు మీద పడ్డాయి. మరోపక్క ఆర్థిక వనరులు చూసుకోవాలి. కేసు వాదించే లాయర్ల సంగతి చూడాలి. జగన్ జైలుకు వెళ్లితే తల్లిగా విజయమ్మకు బాధ వుండొచ్చు కానీ, బాధ్యతల బరువు తక్కువ. సోదరి షర్మిలకు పర్యటన తప్ప, మిగిలిన తలకాయనొప్పలు లేవు. కానీ భారతి పరిస్థితి అలా కాదు. ఇల్లు, ఆఫీసు, జగన్ వ్వవహారాలు, ఆర్థిక సర్దుబాటులు, మధ్యలో భర్తను చూడడం, ఇన్ని సంగతులు. భర్త, ముద్దు ముచ్చట, సినిమాలు, షికార్లు లేనే లేవు. పిల్లల ఆలనా పాలన సరేసరి. అలాంటపుడు అనుకున్నది అనుకున్నట్లుగా జరగనపుడు సంయమనం కోల్పోవడం తప్పదు.

మొన్నటికి మొన్న ఢిల్లీలో సిబిఐ అధికారుల వద్ద, న్యాయవాదుల వద్ద భారతి ప్రవర్తన ఇందుకు అద్దం పట్టింది. ఇప్పుడు నిన్న జగన్ కోర్టుకు హాజరైనపుడు పోలీసుపై చేయి చేసుకునే స్థాయికి ఆమె దిగజారిపోయారు. చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవా అని పెద్దలు ఊరికే అనలేదు. సంతృప్తి అన్నది ఓ పాయింట్ దగ్గర ఆగకపోతే, పరస్థితి ఇలాగే తయారవుతుంది. దానివల్ల వాళ్లు ఒక్కరే ఇబ్బంది పడరు. వారిని నమ్ముకున్నావారు, కట్టుకున్నావారు కూడా ఇబ్బందులు పడాల్సిందే. ఇప్పుడు జగన్, భారతిల పరిస్థితి ఇదే. ఈ సత్యం తెలుసుకుని, నెమ్మదిగా వుండాలి తప్ప, భారతి ఇలా నలుగురిలో తన అసహనాన్ని, అసహాయతను వెళ్లగక్కి చులకనైపోకూడదు.