బాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస మరణాలు అందర్నీ షాక్ కు గురి చేస్తున్నాయి. వారం రోజులు కాకపోముందే ఎవరో ఒకరు చనిపోవడం ఇండస్ర్టీ వ్యక్తులను , అభిమానులను కలవరపెడుతుంది. ఇప్పటికే పలువురు మరణించగా..తాజాగా ప్రముఖ దర్శకులు బసుఛటర్జీ కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో ముంబయిలోని స్వగృహంలో గురువారం తుదిశ్వాసవిడిచారు.
పియా కా ఘర్, రజనీగంధ, ఛోటీ సీ బాత్, ఖట్టా మీటా, చక్రవ్యూహ, జీనాయహా, షౌకీన్‌తో పాటు బాలీవుడ్‌లో పలు విజయవంతమైన చిత్రాల్ని రూపొందించారు. అమితాబ్‌బచ్చన్, మిథున్ చక్రవర్తి, జితేంద్ర, రాజేష్‌ఖన్నా, ధర్మేంద్ర, హేమమాలినీ, నీతూసింగ్, జయాబచ్చన్‌తో పాటు అగ్రనాయకనాయికలందరితో సినిమాలు చేశారు. బెంగాళీ భాషలో కొన్ని సినిమాల్ని తెరకెక్కించారు. అంతేకాకుండా బుల్లితెరపై దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు.
బసుఛటర్జీ మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ‘సున్నితత్వం, ప్రతిభాశీలమైన కథాంశాలతో ప్రజల హృదయాల్ని స్పృశించారు బసుఛటర్జీ. సరళమైన సంక్లిష్ట భావోద్వేగాలతో పాటు ప్రజల పోరాటాల్ని ఆయన సినిమాలు ప్రతిబింబిస్తుంటాయి. బసుఛటర్జీ మరణం విచారకరం’ అని మోదీ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.