Site icon TeluguMirchi.com

బ‌లుపు హిట్టా? ఫ‌ట్టా?

balupuఈమ‌ధ్య ర‌వితేజ జాత‌కం బాగాలేదు. సినిమాల‌న్నీ వ‌రుస‌గా బ‌క్కెట్ త‌న్నేస్తున్నాయి. నిప్పు, దరువు, దేవుడు చేసిన మ‌నుషులు – ఇలా వారం తిర‌క్కుండానే పీచే ముడ్‌… అంటున్నాయి. రొటీన్ క‌థ‌లు, రొటీన్ కామెడీ, రొటీన్ క్యారెక్టరైజేష‌న్‌ తో జ‌నాన్ని విసిగెత్తించాడు ర‌వితేజ‌. దాంతో ఆ సినిమాల్ని ప్రేక్షకులు తిప్పి కొట్టారు. దాంతో బ‌లుపు సినిమాపై తీవ్రమైన ఒత్తిడి ప‌డిపోయంది. ఈ సినిమాని ఎలాగైనా హిట్ చేయాల్సిందే అని ర‌వితేజ పూర్తి శ్రద్ధ ఈ సినిమాపై కేంద్రీక‌రించాడు. మ‌రోవైపు గోపీచంద్ మ‌లినేనిదీ అదే ప‌రిస్థితి. బాడీగార్డ్ సినిమాతో ద్వితీయ   విఘ్నం ఎదురైంది. తన స‌త్తా నిరూపించుకోవాలంటే మూడో సినిమా బలుపుని నిల‌బెట్టాలి. ఇన్ని జాగ్రత్తల మ‌ధ్య బ‌లుపు విడుద‌లైంది.

గ‌త రెండేళ్లుగా ర‌వితేజ సినిమాల‌కు లేని పాజిటివ్ టాక్ బ‌లుపు సినిమా కి వ‌చ్చింది అన‌డంలో సందేహం లేదు. ఆ వార్తలే ఈ సినిమా బాగానే ఉంటుందిలే… అనే భ‌రోసా క‌ల్పించాయి. బ్రహ్మానందం కామెడీ బాగుంద‌ని, శ్రుతిహాస‌న్ గ్లామ‌ర్ స్పెష‌ల్ ఎట్రాక్షన్ అని, ల‌క్ష్మీరాయ్ ప్రత్యేక గీతం చేసింద‌నీ.. ఇలా ర‌క‌ర‌కాల అంశాలు ఈ సినిమాకి యాడ్ అయ్యాయి. దాంతో థియేట‌ర్‌లోకి ప్రేక్షకుడు ఓ పాజిటివ్ మైండ్ సెట్‌ తోనే వెళ్లాడు. అంచ‌నాల‌కు త‌గ్గట్టుగానే కామెడీ బాగానే అనిపించింది. క‌థలో న‌వ్యత లేక‌పోయినా – కాల‌క్షేపం అయిపోయేలా, టికెట్టు రేటు గిట్టుబాటు అయ్యేలా సినిమా తీయ‌గ‌లిగాడు గోపీచంద్ మ‌లినేని. బ్రహ్మానందం కామెడీ, శ్రుతి అందాలు, కొన్ని పంచ్‌ లూ ఈ సినిమాని ఆదుకొన్నాయనేది విశ్లేష‌కుల మాట‌.

అయితే శుక్రవారం నుంచీ ఈ సినిమాకి డివైడ్ టాక్ మొద‌లైంది. కొంద‌రు ర‌వితేజ‌కు హిట్ దొరికింద‌ని తీర్మానం చేస్తే – ఇదీ ఓ సినిమానేనా? అని నొస‌లు చిట్లించారు ఇంకొంత‌మంది. ఇంటర్వెల్  లో ట్విస్టు త‌ప్ప క‌థ‌లో గొప్పదనం ఏమీలేద‌నేది అంద‌రూ ఒప్పుకొంటున్నారు. అయితే నిప్పు, ద‌రువు, దేవుడు చేసిన మ‌నుషులు కంటే ఈ సినిమా బెట‌ర్ అనేది మాత్రం వాస్తవం. అందుకే శుక్ర‌, శ‌ని వారాలు ఈ సినిమాకి మంచి వ‌సూళ్లే ద‌క్కాయి. దేవుడు చేసిన మ‌నుషులు, నిప్పు సినిమాలు రెండో రోజు నుంచే జెండా ఎత్తేశాయి. ద‌రువుకి అయితే ఓపెనింగ్స్ క‌లెక్షన్లే లేవు. అందుకే వాటితో పోలిస్తే ఈ సినిమా వంద‌రెట్లు న‌యం అని చెబుతున్నారంతా!

బ‌లుపు టాక్ యావ‌రేజ్ – ఫ్లాప్ మ‌ధ్యే ఉగిస‌లాడుతోంది. బాక్సాఫీసు ద‌గ్గర సినిమాలేం లేక‌పోవ‌డంతో బ‌లుపు యావ‌రేజ్ టాక్ ద‌గ్గర నిల‌బ‌డిపోయే ఛాన్స్ ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఆదివారం కూడా ఈ సినిమాకి వ‌సూళ్లు బాగానే ఉండే అవ‌కాశం ఉంది. అయితే సోమ‌వారం వ‌సూళ్లే ఈ సినిమా ప‌రిస్థితి డిసైడ్ చేస్తాయి. సోమ‌వారం కూడా వ‌సూళ్లు ఈ రేంజ్ లోనే ఉంటే బలుపు హిట్ కిందే లెక్క‌. సోసోగా ఉంటే మాత్రం బిలో యావ‌రేజ్‌ గా మిగిలిపోయే అవ‌కాశం ఉంది.

Exit mobile version