అమెరికా లోని తెలుగుసంఘాల వారు ఆయనకు జీవన సాఫల్య పురస్కారం తో రెండ్రోజుల క్రితమే అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానటుడు నందమూరి తారక రామారావు తనయుడిగా అందరూ తనను నటుడిగానే చూడాలని కోరుకుంటున్నారని, వారి కోరిక మేరకు తాను జీవితాంతం నటుడిగానే కొనసాగుతానని, ఆ తరువాతనే మరేదైనా ఆలోచిస్తానని ప్రకటించారు. ఈ స్టేట్ మెంట్ ఏదో యాదాలాపంగా చేసారని అనుకోవాలా ? లేక ముందుగా అనుకునే ఇలా మాట్లాడారా అన్నది తేలాల్సి వుంది. నందమూరి ఫ్యామిలీ లో కేవలం ఒక్క బాలకృష్ణ మాత్రమే చంద్రబాబుకు అండగా ఉంటూ వస్తున్నారు. హరికృష్ణ, జూనియర్ ఎన్ టీ ఆర్ లు బాబుకు సన్నిహితంగా లేరు. బాబు కూడా వారిని వ్యూహాత్మకంగా దూరంగా ఉంచుతున్నారు. ఈ నేపధ్యంలో బాలయ్య కూడా పై ప్రకటనకు అనుకూలంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తే మొత్తం నందమూరి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ దూరమయ్యే ప్రమాదం వుంది. బాలయ్య ప్రకటన దేశం రాజకీయాలపైన ఎటువంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.