Site icon TeluguMirchi.com

పనాజీకి.. అద్వానీ డుమ్మా.. !

Advaniభారతీయ జనతా పార్టీలో అంతర్గత విభేదాలు మరింత బయటపడ్డాయి. గోవా రాజధాని పనాజీ వేదికగా రెండురోజుల పాటు జరిగే భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఆ పార్టీ సీనియర్ నేత అద్వానీ దూరంగా ఉంటున్నట్లు సమాచారం. అనారోగ్య కారణాల వలనే సమావేశాలకు అగ్రనేత దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాలు పైకి చెబుతున్నప్పటికినీ.. మోడీ పట్ల కినుక వహించడం వల్లనే ఆయన పనాజీ సభలకు దూరంగా ఉంటున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. 2014 ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్ష బాధ్యతలను నరేంద్రమోడీకి అప్పగించాలననే పార్టీ నిర్ణయాన్ని అగ్రనేత వ్యతిరేకిస్తున్నారనీ.. అందుచేతనే ఆయన పనాజీ సమావేశాలకు డుమ్మా కొట్టబోతున్నట్లు సమాచారం.

పార్టీలో పెరుగుతున్న మోడీ ప్రాబల్యం కారణంగా ఇక తన మాటలు చెల్లుబాటు కావని అద్వానీ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు కనిపిస్తోంది. పార్టీలో మోడీ చాపక్రింద నీరులా విస్తరిస్తున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో సాధించిన విజయాలు మోడీ వర్గానికి మరింత బలానిచ్చాయి. ఇక ఇలాంటి పరిస్థితుల్లో అద్వానీ సమావేశానికి హాజరైన మోడీ వర్గపు గానాబజానా వింటూ కూర్చోవాలి తప్ప, పార్టీకి చేసే దిశానిర్దేశాలేమి ఉండవు. అందువల్లే ఏదో ఒక సాకుతో అద్వానీ ఈ సమావేశాలకు దూరంగా ఉండిపోయినట్లు రాజకీయవర్గాల బోగట్ట. అయితే, ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. అద్వానీ లాంటి అగ్రనేతల అలక భాజపాకు చేటు చేసే అంశమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version