50వేలకు దాటిన కరోనా మరణాలు

భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. నిత్యం దేశంలో దాదాపు 900మంది కొవిడ్‌ రోగులు మృత్యువాతపడుతున్నారు. గడిచిన 24గంటల్లో మరో 941 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో సోమవారం నాటికి దేశంలో కరోనా సోకి మరణించిన వారిసంఖ్య 50,921కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఇక పాజిటివ్‌ కేసుల సంఖ్య నిన్న కాస్త తగ్గింది.

ఆదివారం దేశవ్యాప్తంగా 57,981 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 26,47,663కు చేరింది. వీరిలో ఇప్పటి వరకు 19లక్షల 19వేల మంది కోలుకున్నారు. మరో 6లక్షల 76 వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. వీటి సంఖ్య పెరుగుతున్నప్పటికీ వైరస్‌ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరగడం ఊరట కలిగించే విషయం.