అరుంధతి చిత్రంతో పశుపతి గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు సోను సూద్..ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ కన్నా బాలీవుడ్ ఇండస్ట్రీ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టి అక్కడి సినిమాలు చేస్తూ అక్కడి ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా కరోనా వైరస్ కారణంగా కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ తో వలస కూలీలు తీవ్రం ఇబ్బందులు పడడం చూసి సోను వారిని ఆదుకున్నారు.
కేరళలో ఇరుక్కుపోయిన ఒడిశాకు చెందిన 169 మంది వలస కూలీలను సోనూ సూద్ మే 29న ప్రత్యేక విమానంలో స్వస్థలాలకు పంపించారు. కొచ్చి నుంచి భువనేశ్వర్‌కు ప్రత్యేక విమానం ఏర్పాటుచేసి వీరందరినీ ఒడిశాకు చేర్చారు. సోనూ సూద్ చేసిన సాయానికి రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు, సామాజికవేత్తల నుంచి ప్రశంసల వర్షం కురిసింది. ఒడిశా చేరుకున్న కూలీలు సైతం సోనూ సూద్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కేంద్రపర జిల్లాలోని చించిరి గ్రామానికి చెందిన ప్రశాంత్ కుమార్ ప్రధాన్ సోను సాయం పొందిన వాడే.
స్వస్థలానికి చేరుకున్న తరవాత ఉద్యోగం కోసం పలు చోట్ల ప్రయత్నించిన ప్రశాంత్.. ఎక్కడా పని దొరకకపోవడంతో సొంతంగా షాప్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. భువనేశ్వర్‌కు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న హతినాలో సొంతంగా వెల్డింగ్ వర్క్ షాప్ పెట్టుకున్నాడు. ఈ వర్క్ షాపునకు సోనూ సూద్ పేరు పెట్టి ఆయనపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నాడు.