వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ ..లాక్ డౌన్ ను పూర్తిగా వాడుకుంటున్నాడు. లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ అన్ని మూతపడడం తో సినీ ప్రేమికులు ఓటిటి కి అలవాటుపడ్డారు. దీంతో చాలామంది దర్శక , నిర్మాతలు ఓటిటి లో సినిమాలు రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. వర్మ సైతం ఓ యాప్ లో సినిమాలు రిలీజ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఆ యాప్ కి ఆర్ జి వి వరల్డ్ థియేటర్ అనే పేరును పెట్టుకున్నాడు.
ఇప్పటికే ఆ యాప్ లో కొద్దిరోజుల వ్యవధిలోనే మియా మాల్కోవాతో క్లైమాక్స్, శ్రీ రాపాకతో నగ్నం సినిమాలను తెరకెక్కించి విడుదల చేసాడు. కాగా ఇప్పుడు ఆయన ‘పవర్ స్టార్’ సినిమా జూలై 25న ఉదయం 11 గంటల నుంచి www.rgvworldtheatre.com థియేటర్లో స్ట్రీమింగ్ కాబోతోందని వెల్లడించారు. ఈ సినిమా పే ఫర్ వ్యూ పద్ధతిలోనే చూడాలని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ‘పవర్ స్టార్’ సినిమా ప్రమోషన్స్ లో సినీ ఇండస్ట్రీ సైతం షాకయ్యేలా కొత్త స్ట్రాటజీతో వచ్చాడు వర్మ. సినీ చరిత్రలో ఇంతకముందు ఎన్నడూ లేని విధంగా సినిమా ట్రైలర్ కి కూడా టికెట్ ధర నిర్ణయించాడు. జూలై 22న ఉదయం 11 నుండి “పవర్ స్టార్” ట్రైలర్ ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో అందుబాటులో ఉంటుందని.. ఈ ట్రైలర్ చూడాలంటే పే ఫర్ వ్యూ పద్ధతిలో 25 రూపాయలు చెల్లించాలని పేర్కొన్నాడు. ఇది ప్రపంచంలో మొట్టమొదటి పెయిడ్ ట్రైలర్ అని చెప్పకొచ్చాడు. దీంతో సినీ చరిత్రలో ట్రైలర్ కి కూడా డబ్బులు వసూలు చేసిన ఏకైక వ్యక్తి రామ్ గోపాల్ వర్మ కానున్నారు.